ఫండ్స్‌లో పెట్టుబడులు డీఎల్‌ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్‌లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్‌ఎఫ్‌కు వీలు చిక్కింది.
గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్‌ఎఫ్ శాట్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్‌లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్‌ఎఫ్ శాట్‌కు సోమవారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్‌లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.
డీఎల్‌ఎఫ్‌పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్‌ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.