Securities Appellate Tribunal
-
బీవోపై ఎఫ్‌పీఐల వెనకడుగు
న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లోటస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి. అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం! ఏం జరిగిందంటే? సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది. -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
ముకేశ్ అంబానీకి సెబీ జరిమానా సరికాదు
న్యూఢిల్లీ: రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్లలో అవకతవకల ట్రేడింగ్ వివాదం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్– శాట్ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్‌లో దాఖలైన అప్పీల్లో 87 పేజీల ఈ తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ జనవరి 2021 కీలక రూలింగ్ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్ వద్ద జరిమానాను డిపాజిట్ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్ఐఎల్కు లభించని ఊరట.. అయితే ఈ కేసు విషయంలో ఆర్ఐఎల్ వేసిన అప్పీల్‌ను శాట్ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ తరుణ్ అగర్వాలా, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరా స్వరూప్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, ‘కంపెనీ ఆర్ఐఎల్కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది. నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్ఐఎల్తో ఆర్పీఎల్ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్ఐఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అయితే కంపెనీ (ఆర్ఐఎల్) నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. నగదు, ఎఫ్అండ్ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్పీఎల్ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్ఐఎల్ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది పీఎఫ్‌యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ముకేశ్ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్ బెంచ్ అభిప్రాయపడింది. -
అంబానీ సోదరులకు శాట్‌లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్‌ఏఎస్‌టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్‌లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
జనవరి 15లోగా తేల్చండి
న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటిషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలం టూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్) పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. కార్వీ తనఖా పెట్టిన షేర్లపై యాక్సిస్ బ్యాంక్ రూ. 81 కోట్లు రుణమిచ్చింది. ఆ షేర్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా.. కార్వీ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ నియంత్రణ సంస్థలను యాక్సిస్ బ్యాంక్ కోరుతోంది. -
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్ఎస్డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
కార్వీకి మరో షాక్..!
ముంబై/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సోమవారం ప్రకటించాయి. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా విడుదల చేసిన సర్క్యులర్లలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వివరించాయి. ఈక్విటీ, డెట్ విభాగాల్లో కార్వీ ట్రేడింగ్ టెర్మినల్స్‌ను డీయాక్టివేట్ చేసినట్లు బీఎస్ఈ తెలిపింది. ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ సెగ్మెంట్స్‌లో నిర్దిష్ట ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అటు ఎన్ఎస్ఈ కూడా ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ డెరివేటివ్స్, డెట్, కమోడిటీ డెరివేటివ్స్ వంటి అన్ని విభాగాల్లోనూ కార్వీపై నిషేధం విధించింది. అయితే, బ్రోకింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించనున్నట్లు కార్వీ వర్గాలు తెలిపాయి. ఇది సత్వరమే పరిష్కారం కాగలదని పేర్కొన్నాయి. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వెసులుబాటుకు సెబీ నిరాకరణ.. క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలు (పీవోఏ) ఉపయోగించుకుని వారి ట్రేడ్స్‌ను సెటిల్ చేయడానికి వెసులుబాటు ఇవ్వాలన్న కార్వీ అభ్యర్థనను సెబీ తోసిపుచ్చింది. పీవోఏలను దుర్వినియోగం చేసి, క్లయింట్ల షేర్లను కంపెనీ అక్రమంగా దారి మళ్లించిందని ఆక్షేపించింది. ప్రాథమిక ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్ల పీవోఏలను కార్వీ ఉపయోగించడానికి అనుమతించడం వివేకవంతమైన నిర్ణయం కాబోదని సెబీ స్పష్టం చేసింది. కార్వీ ద్వారా షేర్లను విక్రయించాలనుకుంటున్న క్లయింట్లు.. ఇందుకోసం ఎలక్ట్రానిక్ లేదా ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. విక్రయించిన షేర్లను డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేసేలా బ్రోకింగ్ సంస్థకు క్లయింట్లు సూచనలివ్వడానికి డీఐఎస్ ఉపయోగపడుతుంది. కార్వీపై ఎన్ఎస్ఈ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ ఇంకా కొనసాగుతోందని, క్లయింట్ల షేర్లు.. నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగిందన్నది త్వరలోనే వెల్లడవుతుందని సెబీ వ్యాఖ్యానించింది. పీవోఏను ఉపయోగించుకోవడంపై స్పష్టతనివ్వాలన్న కార్వీ అభ్యర్థ్ధనపై డిసెంబర్ 2లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సెబీకి శాట్ సూచించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్లు.. కార్వీ అక్రమంగా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న షేర్లలో సుమారు 90 శాతం సెక్యూరిటీలు.. తిరిగి క్లయింట్ల ఖాతాల్లోకి చేరాయి. సెబీ తీసుకున్న సత్వర చర్యలతో సుమారు 83,000 మంది ఇన్వెస్టర్లకు తమ షేర్లు తిరిగి వచ్చాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. ‘సెబీ ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఈ పర్యవేక్షణలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతా నుంచి సుమారు 82,599 మంది క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లను బదలాయించడం జరిగింది‘ అని పేర్కొంది. బాకీలు సెటిల్ చేసిన తర్వాత మిగతా వారి ఖాతాల్లోకి కూడా షేర్ల బదలాయింపు పూర్తవుతుందని ఎన్ఎస్డీఎల్ వివరించింది. -
పీడబ్ల్యూసీపై సెబీ నిషేధానికి శాట్ నో
న్యూఢిల్లీ: ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) ఇండియాకు ఊరట లభించింది. లిస్టెడ్ కంపెనీలకు ఆడిటింగ్ సేవలు అందించకుండా ఆ సంస్థ విభాగంపై సెబీ విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. ఆడిటింగ్ సంస్థను నిషేధించే అధికారం సెబీకి లేదని స్పష్టం చేసింది. కేవలం ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) మాత్రమే ఆడిటర్లపై చర్యలు తీసుకోగలదని పేర్కొంది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ఆధారంగా ఆర్థిక మోసాలను నిరూపించలేరని శాట్ అభిప్రాయపడింది. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకుండా సెబీ తీసుకున్న చర్యలు చెల్లుబాటు కావని పేర్కొంది. లిస్టెడ్ కంపెనీలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆడిటింగ్ సర్టిఫికెట్లు జారీ చేయకూడదంటూ పీడబ్ల్యూసీకి చెందిన సంస్థలపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ సెబీ 2018 జనవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2009 జనవరి 8న సత్యం కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయని, కొంత కాలంగా పుస్తకాల్లో రూ.5,004 కోట్ల మేర వాస్తవాలను దాచిపెట్టినట్టు ఆ సంస్థ చైర్మన్ రామలింగ రాజు స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో ఆడిటింగ్ కంపెనీ పాత్ర ఉందని సెబీ దర్యాప్తులో తేలింది. పీడబ్ల్యూసీ బెంగళూరుతోపాటు, ఆ సంస్థ భాగస్వాములు ఎస్ గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి ఐసీఏఐ ఆడిటింగ్ ప్రమాణాల మేరకు నడుచుకోలేదని సెబీ గుర్తించింది. సెబీ ఆదేశాలను పీడబ్ల్యూసీ శాట్‌లో సవాలు చేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణంలో రెండు అతిపెద్ద ఆడిటింగ్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్ (కేపీఎంజీ సంస్థ)ల పాత్రపై నియంత్రణ సంస్థలు, ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు జరుగుతున్న సమయంలో శాట్ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం గమనర్హాం. ఇతరుల అధికార పరిధిలోకి చొరబడరాదు భవిష్యత్తులో సెబీ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగానూ శాట్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇతర నియంత్రణ సంస్థలు లేదా ఐసీఏఐ వంటి పరిశ్రమ బాడీల అధికార పరిధిలోకి చొరబడరాదని స్పష్టం చేసింది. -
విచారణ లేకుండా ఆదేశాలేంటి?
♦ సెబీని ప్రశ్నించిన శాట్ ♦ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ‘షెల్’ కంపెనీలు ♦ వీటిలో జేకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రకాష్ ఇండస్ట్రీస్, పార్శ్వనాథ్ డెవలపర్స్ ♦ సెబీ ఉత్తర్వులపై స్టే విధించాలని వినతి ♦ విచారణ నేటికి వాయిదా ముంబై: అనుమానిత షెల్ కంపెనీలంటూ సెబీ ముద్ర వేయడమే కాకుండా ట్రేడింగ్‌కు సంబంధించి ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ పలు కంపెనీలు బుధవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (శాట్) ఆశ్రయించాయి. వీటిలో ప్రధానంగా జేకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్టŠస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, పార్శ్వనాథ్ డెవలపర్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నామని, తమవి షెల్ కంపెనీలు కావని అవి స్పష్టం చేశాయి. సెబీ ట్రేడింగ్ ఆంక్షలపై స్టే విధించాలని కోరాయి. సెబీ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కూడా షెల్ కంపెనీల పేరిట ఈ జాబితాలో చేర్చారంటూ శాట్ దృష్టికి తీసుకెళ్లాయి. దీనికి స్పందించిన శాట్... ఆదేశాలు జారీ చేసే ముందు ఆయా కంపెనీలకు సంబంధించి ఎందుకు విచారణ నిర్వహించలేదని సెబీని ప్రశ్నించింది. సెబీ మాత్రం తన చర్యను సమర్థించుకుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి అందిన జాబితా ఆధారంగా 331 అనుమానిత షెల్ కంపెనీలపై చర్యలకు ఆదేశించినట్టు శాట్‌కు తెలిపింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్టాక్ ఎక్సేంజ్‌లను కోరినట్టు వెల్లడించింది. అయితే, కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి జాబితా జూన్ 9నే సెబీకి అందగా, ఆగస్ట్ 7న ఆదేశాలు జారీ చేసినట్టు తెలియడంతో ఈ మధ్య కాలంలో విచారణ నిర్వహించి ఉండొచ్చు కదా అని శాట్ ప్రశ్నించింది. ఈ పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. అన్నీ కావు... ట్రేడయ్యేవి కొన్నే : బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన 331 కంపెనీల్లో వాస్తవానికి ట్రేడవుతున్నవి సగం మేరే ఉన్నాయి. ఇందుకు సంబంధించి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బుధవారం ఓ ప్రకటన జారీ చేశాయి. సెబీ ఆదేశించిన 331 కంపెనీల్లో 164 కంపెనీల స్టాక్స్‌ను అంతకుముందే వివిధ రకాల కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది. ట్రేడ్ అవుతున్న మిగిలిన 167 కంపెనీల స్టాక్స్‌లో చాలా వాటిపై ఈ నెల 8నుంచే ఆరో గ్రేడ్ నిఘా ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చాం’’ అని బీఎస్ఈ పేర్కొంది. -
13లో స్పందించినవి 3
♦ సెబీ చర్య సరికాదన్నసైబర్మేట్, ఫ్రాంటియర్, ఫార్మాక్స్ ♦ మిగిలినవి అడ్రస్ లేని పరిస్థితే ♦ సంప్రతించటానికి ‘సాక్షి’ చేసిన ప్రయత్నాలు విఫలం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షెల్ కంపెనీలుగా సెబీ ముద్ర వేయటంపై పలు సంస్థలు బుధవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. మరికొన్ని బీఎస్ఈకి, సెబీకి తమ వ్యతిరేకత తెలియజేస్తూ లేఖలు పంపాయి. నిజం చెప్పాలంటే సెబీ విడుదల చేసిన 331 కంపెనీల జాబితాలో చాలావరకూ డొల్ల కంపెనీలే. అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు కూడా లేకుండా... స్టాక్ మార్కెట్లో మాత్రం షేర్ల లావాదేవీలు దివ్యంగా జరుపుతున్నవే. కాకపోతే సెబీ జాబితాలో ప్రకాష్ ఇండస్ట్రీస్, జెకుమార్ ఇన్ఫ్రా వంటి దాదాపు డజనుకు పైగా కంపెనీలు మంచి మార్కెట్ విలువతో పాటు చక్కని లాభాలార్జిస్తున్నవి కావటం గమనార్హం. ఇలాంటి వాటిని కూడా షెల్ జాబితాలో వేసేయటంతో పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవటమే కాక... కొన్ని కంపెనీలు న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ 331 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి దాదాపు 13 వరకూ ఉన్నాయి. ఇవి నిజంగా షెల్ కంపెనీలేనా? వీటిని ఎందుకు జాబితాలో చేర్చారు? అసలు వీటి చిరునామాలు సరైనవేనా? వీటికి తాడూ బొంగరం ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవటానికి బుధవారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అడ్రస్ ఉండి... స్పందించినవి మూడే కావటం గమనార్హం. మిగిలిన వాటి ఫోన్ నెంబర్లే కాదు... ఆచూకీ సైతం తెలియరాలేదు. ఆ వివరాలు చూస్తే... ‘‘మేం కంపెనీల చట్టం ప్రకారం ప్రతి నిబంధననూ పాటిస్తున్నాం. ఆదాయపు పన్ను, సేవా పన్ను క్రమం తప్పకుండా కడుతున్నాం. మాది షెల్ కంపెనీ కాదు. మాకు ఏ షెల్ కంపెనీతోనూ సంబంధాలు కూడా లేవు. మాకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) గుర్తింపు ఉంది. మా పేరు షెల్ కంపెనీల జాబితాలో రావటం విస్మయానికి గురి చేసింది’’ అని సైబర్మేట్ ఇన్ఫోటెక్ ప్రతినిధి చెప్పారు. ఇదే విషయాన్ని సంస్థ బీఎస్ఈకి కూడా వెల్లడించింది. 30 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని, ఏ రోజూ తప్పుడు పనిచేయలేదని ఫ్రాంటియర్ ఇన్ఫర్మాటిక్స్ ప్రతినిధి తెలిపారు. ‘ముందస్తు నోటీసు లేకుండా సెబీ ఈ చర్య తీసుకోవడం అన్యాయం. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఐటీ కంపెనీ మాదే. 2,000 మందికిపైగా ఉపాధి కల్పించాం. ఇప్పుడిలా ఎందుకు జరిగిందో అంతుపట్టడం లేదు’ అని ఆయన వాపోయారు. జీడీఆర్ కేసులో ఫార్మాక్స్.. గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) జారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్మాక్స్ ఇండియా సైతం అనుమానిత షెల్ కంపెనీల జాబితాలో ఉంది. ‘‘జీడీఆర్ జారీ ప్రక్రియలో అల్టా విస్టా ఇంటర్నేషనల్ సంస్థ మమ్మల్ని మోసం చేసింది. ఆ కంపెనీ ఎండీ అరుణ్ పంచరియాపై చర్యలు తీసుకోవాలని మేం గతంలో దాఖలు చేసిన పలు కేసులు పెండింగులో ఉన్నాయి. మేమెలాంటి అవకతవకలకూ పాల్పడలేదు’’ అని సంస్థ ప్రతినిధి చెప్పారు. వీటి చిరునామాలూ తప్పేనా? మిగిలిన సంస్థల్లో సొంత వెబ్సైట్, ఫోన్ నంబర్ లేని కంపెనీలే ఎక్కువ. ఇన్నాళ్లూ బీఎస్ఈకి ఫైల్ చేసిన పత్రాల్లో పేర్కొన్న ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. కొన్ని నంబర్లు పనిచేస్తున్నా అటు నుంచి స్పందన లేదు. ప్రొసీడ్ ఇండియా పేరిట వెబ్సైట్ పనిచేస్తున్నా... ఆ వెబ్సైట్లో పేర్కొన్న ఫోన్ నెంబరు మాత్రం పనిచేయటం లేదు. యంత్ర నేచురల్ రిసోర్సెస్దీ అదే పరిస్థితి. ఇక త్రినేత్ర ఇన్ఫ్రా వెంచర్స్ జాడే లేదు. ఎల్ఎన్ ఇండస్ట్రీస్ ఇండియాకు వెబ్సైట్ లేకపోగా బీఎస్ఈకి ఇచ్చిన నంబరూ పనిచేయడం లేదు. వెన్మ్యాక్స్ డ్రగ్స్, జీఆర్ కేబుల్స్‌కు సంబంధించి వాటి ప్రతినిధుల్ని వివిధ మార్గాల్లో సంప్రతించే ప్రయత్నాలు చేసినా అట్నుంచి స్పందన లేదు. పాల్కో లిమిటెడ్ ల్యాండ్‌లైన్ నంబరు ప్రస్తుతం ఓ న్యాయవాది వద్ద ఉంది. చాలా రోజుల క్రితమే టెలికం కంపెనీ తమకు ఈ నంబరు కేటాయించిందని ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
డీఎల్ఎఫ్ బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.250 ఎందుకంటే: ప్రమోటర్ల దగ్గరున్న కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(సీసీపీఎస్) కన్వర్షన్‌ను ఒక ఏడాది కాలం పాటు వాయిదా వేసింది. దీంతో నిధుల సమీకరణకు కంపెనీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ నెల 19న జరగాల్సిన ఈ కన్వర్షన్ ఏడాది కాలం పాటు వాయిదా పడింది. మరోవైపు ఈ సీసీపీఎస్లపై చెల్లించాల్సిన కూపన్ రేటు 9 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించారు. దీని వల్ల డివిడెండ్‌గా చెల్లించాల్సిన 144 కోట్లు కంపెనీకి ఆదా అవుతాయి. మరోవైపు డీఎల్ఎఫ్ ప్రమోటర్లు మార్కెట్లో మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించరాదన్న సెబీ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ఆరు నెలలకు తగ్గించింది. శాట్ తాజా ఉత్తర్వు కారణంగా కంపెనీ నిధుల సమీకరణకు అడ్డం కులు దాదాపుగా తొలగినట్లే. కంపెనీ అమ్మకాలు పుంజుకునేదాకా రీట్, క్విప్‌ల ద్వారా నిధులు సమీకరించడం షేర్ ధరపై సానుకూల ప్రభావమే చూపవచ్చు. అమ్మకాలు పుంజుకుంటే, నగదు నిల్వలు పుష్కలంగా కంపెనీకి అందుబాటులోకి వస్తాయి. దీంతో మిడ్-ఇన్‌కం ప్రాజెక్ట్‌లను కంపెనీ ప్రారంభించగలుగుతుందని అంచనా. బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత మార్కెట్ ధర: రూ.1,382 టార్గెట్ ధర: రూ.1,930 ఎందుకంటే: ఈ కంపెనీలో 35 శాతం దాకా వాటాలు ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)ఇన్వెస్టర్లు తమ వాటాను తగ్గించుకుంటున్నారని, త్వరలో ప్రారంభం కానున్న సెర్చ్‌ప్లస్(ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్) వ్యాపారంపై ప్రకటనల వ్యయం అంచనాలను మించి పెరిగిపోవచ్చని, తదితర అంశాల కారణంగా ఈ షేర్ ధర ఇటీవల కాలంలో 25 శాతం వరకూ క్షీణించింది. నాలుగేళ్లలో లోకల్ సెర్చ్ బిజినెస్ 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యాజమాన్యం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సెర్చ్ ప్లస్ వ్యాపారం ఆదాయం 2018-19 కల్లా కంపెనీ రాబడిలో 14 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. ఇ-టెయిలింగ్‌లో ప్రవేశించడం వంటి కారణాల వల్ల కంపెనీ ఆదాయం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. అలాగే నాలుగేళ్లలో ఈపీఎస్ 39 శాతం చొప్పున చక్రగతిన పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో జేడీ క్యాష్ పేరుతో వాలెట్ సర్వీసునూ అందించనున్నది. జేడీ క్యాష్ డెవలప్మెంట్ దాదాపు పూర్తయిందని, త్వరలో ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,930గా నిర్ణయించాం. -
ఫండ్స్‌లో పెట్టుబడులు డీఎల్ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్ఎఫ్కు వీలు చిక్కింది. గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్‌లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌కు సోమవారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్‌లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. డీఎల్‌ఎఫ్‌పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సెబీ ఆదేశాలపై శాట్‌కు ‘సత్యం’ రాజు
ముంబై: సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణంలో చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జించారంటూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జరిమానా, నిషేధం విధించడంపై ఆ కంపెనీ మాజీ వ్యవస్థాపక చైర్మన్ బి.రామలింగరాజు, మరో నలుగురు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. ఈ ఐదు వేర్వేరు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేదానిపై శాట్ నేడు(సోమవారం) విచారించనుంది. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంగా నిలిచిన ఈ కేసులో ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సెబీ జూలై 15న తుది ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సత్యం రాజు, ఆయన సోదరుడు బి. రామరాజు(అప్పటి సత్యం ఎండీ), కంపెనీ మాజీ సీఎఫ్ఓ వడ్డమాని శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి. రామకృష్ణ, అంతర్గత ఆడిట్ మాజీ హెడ్ వీఎస్ ప్రభాకర్ గుప్తాలు చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగివ్వాలంటూ ఆదేశించింది. వడ్డీని కూడా కలిపితే ఈ ఐదుగురు చెల్లించాల్సిన మొత్తం రూ.3 వేల కోట్లకుపైనే ఉంటుంది. 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని తమకు కట్టాల్సిందేనంటూ తేల్చిచెప్పడంతోపాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా 14 ఏళ్లపాటు నిషేధాన్ని కూడా వీరిపై సెబీ విధించింది.