పీడబ్ల్యూసీపై సెబీ నిషేధానికి శాట్‌ నో | SAT sets aside SEBI order barring PricewaterhouseCoopers | Sakshi
Sakshi News home page

పీడబ్ల్యూసీపై సెబీ నిషేధానికి శాట్‌ నో

Published Tue, Sep 10 2019 5:47 AM | Last Updated on Tue, Sep 10 2019 5:47 AM

SAT sets aside SEBI order barring PricewaterhouseCoopers - Sakshi

న్యూఢిల్లీ: ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) ఇండియాకు ఊరట లభించింది. లిస్టెడ్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలు అందించకుండా ఆ సంస్థ విభాగంపై సెబీ విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) కొట్టివేసింది. ఆడిటింగ్‌ సంస్థను నిషేధించే అధికారం సెబీకి లేదని స్పష్టం చేసింది. కేవలం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) మాత్రమే ఆడిటర్లపై చర్యలు తీసుకోగలదని పేర్కొంది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ఆధారంగా ఆర్థిక మోసాలను నిరూపించలేరని శాట్‌ అభిప్రాయపడింది. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకుండా సెబీ తీసుకున్న చర్యలు చెల్లుబాటు కావని పేర్కొంది. లిస్టెడ్‌ కంపెనీలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆడిటింగ్‌ సర్టిఫికెట్‌లు జారీ చేయకూడదంటూ పీడబ్ల్యూసీకి చెందిన సంస్థలపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ సెబీ 2018 జనవరిలో ఆదేశాలు జారీ చేసింది.

2009 జనవరి 8న సత్యం కంప్యూటర్స్‌ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయని, కొంత కాలంగా పుస్తకాల్లో రూ.5,004 కోట్ల మేర వాస్తవాలను దాచిపెట్టినట్టు ఆ సంస్థ చైర్మన్‌ రామలింగ రాజు స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో ఆడిటింగ్‌ కంపెనీ పాత్ర ఉందని సెబీ దర్యాప్తులో తేలింది. పీడబ్ల్యూసీ బెంగళూరుతోపాటు, ఆ సంస్థ భాగస్వాములు ఎస్‌ గోపాలకృష్ణన్, శ్రీనివాస్‌ తాళ్లూరి ఐసీఏఐ ఆడిటింగ్‌ ప్రమాణాల మేరకు నడుచుకోలేదని సెబీ గుర్తించింది. సెబీ ఆదేశాలను పీడబ్ల్యూసీ శాట్‌లో సవాలు చేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంలో రెండు అతిపెద్ద ఆడిటింగ్‌ సంస్థలైన డెలాయిట్, బీఎస్‌ఆర్‌ (కేపీఎంజీ సంస్థ)ల పాత్రపై నియంత్రణ సంస్థలు, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు జరుగుతున్న సమయంలో శాట్‌ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం గమనర్హాం.

ఇతరుల అధికార పరిధిలోకి చొరబడరాదు
భవిష్యత్తులో సెబీ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగానూ శాట్‌ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇతర నియంత్రణ సంస్థలు లేదా ఐసీఏఐ వంటి పరిశ్రమ బాడీల అధికార పరిధిలోకి చొరబడరాదని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement