విచారణ లేకుండా ఆదేశాలేంటి?
♦ సెబీని ప్రశ్నించిన శాట్
♦ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ‘షెల్’ కంపెనీలు
♦ వీటిలో జేకుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రకాష్ ఇండస్ట్రీస్, పార్శ్వనాథ్ డెవలపర్స్
♦ సెబీ ఉత్తర్వులపై స్టే విధించాలని వినతి
♦ విచారణ నేటికి వాయిదా
ముంబై: అనుమానిత షెల్ కంపెనీలంటూ సెబీ ముద్ర వేయడమే కాకుండా ట్రేడింగ్‌కు సంబంధించి ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ పలు కంపెనీలు బుధవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (శాట్) ఆశ్రయించాయి. వీటిలో ప్రధానంగా జేకుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టŠస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, పార్శ్వనాథ్ డెవలపర్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నామని, తమవి షెల్ కంపెనీలు కావని అవి స్పష్టం చేశాయి. సెబీ ట్రేడింగ్ ఆంక్షలపై స్టే విధించాలని కోరాయి. సెబీ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కూడా షెల్ కంపెనీల పేరిట ఈ జాబితాలో చేర్చారంటూ శాట్ దృష్టికి తీసుకెళ్లాయి.
దీనికి స్పందించిన శాట్... ఆదేశాలు జారీ చేసే ముందు ఆయా కంపెనీలకు సంబంధించి ఎందుకు విచారణ నిర్వహించలేదని సెబీని ప్రశ్నించింది. సెబీ మాత్రం తన చర్యను సమర్థించుకుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి అందిన జాబితా ఆధారంగా 331 అనుమానిత షెల్ కంపెనీలపై చర్యలకు ఆదేశించినట్టు శాట్‌కు తెలిపింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్టాక్ ఎక్సేంజ్‌లను కోరినట్టు వెల్లడించింది. అయితే, కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి జాబితా జూన్ 9నే సెబీకి అందగా, ఆగస్ట్ 7న ఆదేశాలు జారీ చేసినట్టు తెలియడంతో ఈ మధ్య కాలంలో విచారణ నిర్వహించి ఉండొచ్చు కదా అని శాట్ ప్రశ్నించింది. ఈ పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది.
అన్నీ కావు... ట్రేడయ్యేవి కొన్నే : బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ
సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన 331 కంపెనీల్లో వాస్తవానికి ట్రేడవుతున్నవి సగం మేరే ఉన్నాయి. ఇందుకు సంబంధించి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ బుధవారం ఓ ప్రకటన జారీ చేశాయి. సెబీ ఆదేశించిన 331 కంపెనీల్లో 164 కంపెనీల స్టాక్స్‌ను అంతకుముందే వివిధ రకాల కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది. ట్రేడ్ అవుతున్న మిగిలిన 167 కంపెనీల స్టాక్స్‌లో చాలా వాటిపై ఈ నెల 8నుంచే ఆరో గ్రేడ్ నిఘా ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చాం’’ అని బీఎస్‌ఈ పేర్కొంది.