న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ)ని ఆదేశించింది.
కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్‌ఎస్‌డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
Published Thu, Dec 5 2019 5:44 AM | Last Updated on Thu, Dec 5 2019 5:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment