సెబీ ఆదేశాలపై శాట్‌కు ‘సత్యం’ రాజు
ముంబై: సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణంలో చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జించారంటూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జరిమానా, నిషేధం విధించడంపై ఆ కంపెనీ మాజీ వ్యవస్థాపక చైర్మన్ బి.రామలింగరాజు, మరో నలుగురు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. ఈ ఐదు వేర్వేరు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేదానిపై శాట్ నేడు(సోమవారం) విచారించనుంది.
దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంగా నిలిచిన ఈ కేసులో ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సెబీ జూలై 15న తుది ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సత్యం రాజు, ఆయన సోదరుడు బి. రామరాజు(అప్పటి సత్యం ఎండీ), కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వడ్డమాని శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి. రామకృష్ణ, అంతర్గత ఆడిట్ మాజీ హెడ్ వీఎస్ ప్రభాకర్ గుప్తాలు చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగివ్వాలంటూ ఆదేశించింది.
వడ్డీని కూడా కలిపితే ఈ ఐదుగురు చెల్లించాల్సిన మొత్తం రూ.3 వేల కోట్లకుపైనే ఉంటుంది. 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని తమకు కట్టాల్సిందేనంటూ తేల్చిచెప్పడంతోపాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా 14 ఏళ్లపాటు నిషేధాన్ని కూడా వీరిపై సెబీ విధించింది.