సెబీ, శాట్‌లకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచన
మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌ల ఏర్పాటు అవసరమని ఉద్ఘాటన
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు.
→ బీఎస్‌ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు.
→ ‘మీరు స్టాక్ మార్కెట్‌లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
→ స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు.
6,700 అప్పీళ్ల పరిష్కారం
శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు.
శాట్ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం..
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment