Satyam scam
-
సత్యం కుంభకోణం.. ఇద్దరు సీఏల సభ్యత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్ల సభ్యత్వాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రద్దు చేసింది. హైదరాబాద్‌కు చెందిన పులవర్తి శివప్రసాద్, సీహెచ్ రవీంద్రనాథ్‌లు ఐసీఏఐ నిబంధనలు మీరి వృత్తిపరమైన అవకతవకలకు పాల్పడ్డారని వారి సభ్యత్వం రద్దుతోపాటు చెరో రూ.5లక్షల జరిమానా విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వారిద్దరూ అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా కమిటీ సిఫార్సును సమర్థించింది. దీంతో వారిద్దరూ రూ.5లక్షలు జరిమానా ఐసీఏఐకి చెల్లించి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఢిల్లీ కోర్టు వారిద్దరి పిటిషన్లు కొట్టివేయడంతో ఐసీఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పులవర్తి శివప్రసాద్ (సభ్యతం–204076) , సీహెచ్ రవీంద్రనాధ్ (సభ్యత్వం–204494)ల పేరు సభ్యుల రిజిస్టర్ నుంచి తొలగిస్తున్నామని, ఇది డిసెంబరు 27, 2023 నుంచి అమలులోకి వస్తుందని ఐసీఏఐ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
సత్యం కుంభకోణం గురించి మీరు తెలుసుకోవలసినది : వై.ఎస్.రాజశేఖరరెడ్డి
-
సత్యం స్కాం: 14 ఏళ్ల నిషేధం ఉత్తర్వులు పక్కకి, రామలింగరాజుకు ఊరట
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో రామలింగరాజు తదితరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ పక్కన పెట్టింది. 14 ఏళ్ల వ్యవధిని నిర్దేశించడానికి ఏ కారణమూ చూపలేదని పేర్కొంది. అలాగే ఒక్కొక్కరూ అక్రమంగా ఎంతెంత లబ్ధి పొందారో వేర్వేరుగా లెక్కించాల్సిందని సూచించింది. దీనిపై నాలుగు నెలల్లో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెడితే .. ఖాతాల్లో అవకతవకలు బైటపడటంతో 2009లో సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రమోటర్లయిన రామలింగ రాజు, రామ రాజులతో పాటు పలువురిపై కేసులు దాఖలయ్యాయి. ఆరుగురిని సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 14 ఏళ్లు నిషేధించడంతో పాటు భారీగా జరిమానా విధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2018లో రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై వారు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వచ్చాయి. -
సత్యం స్కాం:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ అప్పటి చైర్మన్ బి.రామలింగరాజుకు రబ్బర్ స్టాంప్ మాదిరిగా పనిచేసినట్టు విమర్శించారు. 2009 జనవరిలో రూ.7,800 కోట్ల రూపాయల సత్యం స్కామ్ వెలుగులోకి రావడం తెలిసిందే. (బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్) అనంతరం జరిగిన పరిణామాల్లో సత్యంను టెక్ మహీంద్రా సొంతం చేసుకుని, తనలో విలీనం చేసుకుంది. చాలా ఏళ్లపాటు లేని లాభాలను చూపిస్తూ వచ్చినట్టు రామలింగరాజు స్వయంగా అంగీకరించారు. ఏ కంపెనీ సీఈవో అయినా వాటాదారుల కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలని పరేఖ్ సూచించారు. విఫలమవుతున్న కంపెనీల సంఖ్య పెరుగుతోందంటూ, కొందరి అత్యాశ కారణంగా ప్రజలు డబ్బును, విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు చెప్పారు. (కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం) ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా స్పందిస్తూ.. నాటి సత్యం కంప్యూటర్ స్కామ్ సమయంలో బోర్డును ప్రభుత్వం రద్దు చేసి, ప్రైవేటు రంగంలో నిపుణులతో భర్తీ చేసినట్టు చెప్పారు. నాడు నిపుణులతో ఏర్పాటు చేసిన సత్యం బోర్డులో పరేఖ్‌కు సైతం స్థానం కల్పించడం గమనార్హం. (Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!) ఇదీ చదవండి: ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే? -
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు
స్టాక్ బ్రోకర్లకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సూచన న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచించాయి. నిషేధం ఎదుర్కొంటున్న వారిలో రామలింగ రాజు తల్లి బి. అప్పలనరసమ్మ, ఆయన ఇద్దరు కుమారులు తేజ రాజు .. రామ రాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఝాన్సీ రాణి (సూర్యనారాయణ రాజు భార్య), చింతలపాటి శ్రీనివాస రాజు (అప్పట్లో సత్యం డెరైకర్)తో పాటు చింతలపాటి హోల్డింగ్స్, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ సంస్థలు ఉన్నాయి. అక్రమంగా ఆర్జించిన రూ. 1,800 కోట్లు కట్టాలంటూ రామలింగ రాజు సంబంధీకులు, సంస్థలను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2009 జనవరి 7 నుంచి వడ్డీ కింద మరో రూ. 1,500 కోట్లు కూడా వీరు కట్టాల్సి ఉంటుంది. సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు స్వయంగా వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. -
సత్యం స్కాం.. రూ. 1800 కోట్ల జరిమానా
దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు అక్రమంగా పోగేసుకున్న రూ. 1800 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. 2009 జనవరి ఏడో తేదీ నుంచి జరిమానా విధించాల్సి ఉన్నందున.. ఆ మొత్తం మీద వడ్డీగా మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించాలని తెలిపింది. ఈ పది సంస్థలు రామలింగరాజు సమీప బంధువులవే. వాళ్లలో ఆయన తల్లి, సోదరుడు, కుమారుడు.. కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో అకౌంట్లు తెరిచి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు గాను ఈ జరిమానాలు విధించారు. రామలింగరాజుతో పాటు మరో నలుగురిని 14 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి సెబి బహిష్కరించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 1849 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని గత సంవత్సరం జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, ఆయన సోదరుడు (నాటి సత్యం ఎండీ) రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్ఓ), జి.రామకృష్ణ (నాటి వైస్ ప్రెసిడెంట్), వీఎస్ ప్రభాకర గుప్తా (అంతర్గత ఆడిట్ విభాగం మాజీ అధిపతి)లపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను కూడా సెబి ఈ కేసులో పెట్టింది. ఈ కంపెనీలలో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇంతకుముందు మేటాస్ ఇన్ఫ్రా) ఉన్నాయి. రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ, ఆమె ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన భార్య ఝాన్సీ రాణి, చింతలపాటి శ్రీనివాస్ (నాటి డైరెక్టర్), ఆయన తండ్రి దివంగత అంజిరాజు తదితరులు కూడా ఉన్నారు. -
'సత్యం స్కామ్ వెనుక చంద్రబాబు హస్తం'
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మరణించిన నేతలపై కాకుండా సత్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. సత్యం కుంభకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందేమోనన్న అనుమానాలున్నాయని అన్నారు. ఇక.. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక వెంకయ్య నాయుడు ఆస్తులు పెరిగాయని వీహెచ్ ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వెంకయ్యనాయుడు కుమార్తె భారీగా సంపాదిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ఆయన కుటుంబ ఆస్తులపై విచారణ జరుగుతుందని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్ అంశంలో బీజేపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాతలు ఆగ్రహజ్వాల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారంటూ బీజేపీ సర్కారు నాటకమాడుతోందని విమర్శించారు. -
దాచినా దాగని ‘సత్యం’
రాజు కుటుంబీకులతో పాటు అప్పట్లో కొన్నవారికీ లాభాలు ఐదారేళ్లపాటు నకిలీ లెక్కలు కొనసాగినా గుర్తించని ఆడిటర్లు మేటాస్ డీల్ ఓకే అయి ఉంటే స్కామ్ బయటపడేదే కాదు!! రియల్టీ విలువలు తగ్గినపుడు ఈ నిర్ణయం తీసుకోవటమూ ఓ కారణమే సాక్షి బిజినెస్ విభాగం సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలో భారీగా దెబ్బతిన్నది, నష్ట పోయింది ఎవరైనా ఉంటే ఆ కంపెనీ షేర్లు కొనుక్కుని... కుంభ కోణం బయటపడ్డ వెంటనే భయంతో అమ్మేసిన ఇన్వెస్టర్లే. ఎందుకంటే రూ.540 చూసిన సత్యం షేరు... ఆ పతనంలో రూ.12కు పడిపోయింది. మరి మోసపూరిత లెక్కలతో లేని ఆస్తుల్ని, రాని లాభాల్నే కాక, లేని ఉద్యోగులను కూడా చూపించి షేరు విలువను అమాంతం పెంచేసిన ఈ వ్యవహారంలో లాభపడిందెవరు? అలా పెరిగిన సందర్భాల్లో వాటాలమ్ముకున్న ప్రతి ఒక్కరూ లబ్ధిదారులే. వారిలో ముందున్నది సత్యం వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సంబంధీకులే. గురువారం ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటిస్తూ ‘‘ఇలాంటి నేరాల్లో శిక్షను ప్రకటించేటపుడు నేరగాళ్ల చర్యల ద్వారా దెబ్బతిన్న వారి ఆవేదనను దృష్టిలో పెట్టుకోవాలి’’ అని చెప్పింది కూడా అందుకే. అయితే ప్రభుత్వ వేలంలో వాటా కొనుక్కుని విలువైన కంపెనీని తక్కువ మొత్తానికే చేజిక్కించుకున్న టెక్ మహీంద్రా కూడా లాభపడినట్టే చెప్పుకోవాలి. ఐదారేళ్లుగా ఆడిటర్లేం చేసినట్లు? సత్యం వ్యవహారంలో గమనించాల్సినవెన్నో ఉన్నాయి. దాదాపు ఐదారేళ్లపాటు రాని ఆదాయాన్ని వచ్చినట్టుగా చూపిస్తూ వచ్చిన రామలింగరాజు... బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వడ్డీతో సహా అన్నీ నకిలీ లెక్కలే చూపించారు. ఇలా నకిలీ మొత్తం రూ.5,040 కోట్లకు చేరుకోవటంతో దీనికి ముగింపు పలకాలనుకున్నారు. అందుకే తన కుటుంబానికి చెందిన మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్‌ను రూ.7,680 కోట్లకు కొనుగోలు చేసేలా సత్యం తరఫున తానే నిర్ణయం తీసుకున్నారు. ఆ డీల్ ఓకే అయితే అందులో రూ.5,040 కోట్లను మేటాస్‌కు చెల్లించకుండానే చెల్లించినట్లు చూపించాలని... అపుడు సత్యంలో కృత్రిమ లెక్కలకు తెరవేయవచ్చనేది ఆయన ఆలోచన. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా! ఈ మోసం ఎన్నటికీ బయటపడేది కాదేమో!! మరికొందరు చెబుతున్నట్లుగా రామలింగరాజు కనక మేటాస్ డీల్ నిర్ణయాన్ని 2009 జనవరిలో కాకుండా రియల్ ఎస్టేట్ ధరలు పతాక స్థాయిలో ఉన్న ఏ 2007 ఆఖర్లోనో, 2008 జనవరిలోనో తీసుకుంటే అంతా ఆ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో ఆమోదించేవారేమో!! సరే! ఈ విషయాన్ని పక్కనబెడితే ఐదారేళ్లపాటు ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నపుడు ఆడిటర్లేం చేశారనేదీ ప్రశ్నే. కార్పొరేట్ వ్యవస్థకు పోలీసు ల్లాంటి ఆడిటర్లే విఫలమైతే ఏమనుకోవాలి? ఎందుకంటే అంతకు ముందటి సంవత్సరమే... అంటే 2008లో ఉత్తమ కార్పొరేట్ పాలనకు గాను సత్యంకు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డుతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది కూడా!!. ‘సత్యం’ ఒక్కటే కాదు.. సత్యం కుంభకోణం బయటపడ్డపుడు... ఇలా లాభాల్ని పెంచి చూపిస్తూ ఖాతాల్లో మోసాలకు తెరతీస్తున్న సంస్థలు చాలా ఉన్నాయని, మరెన్నో ‘సత్యం’లు బయటపడతాయని కార్పొరేట్ నియంత్రణ సంస్థలు వ్యాఖ్యానించటం తెలియనిది కాదు. సదరు ప్రమోటర్లు జాగ్రత్తపడ్డారో, నియంత్రణ సంస్థలు నెమ్మదించాయో కానీ ఆ తరవాత ఇలాంటివేవీ బయటపడలేదు. అయితే రాని లాభాల్ని చూపించిన తరహాలోనే లేని వ్యాపారాన్ని చూపించిన ‘సుజనా మెటల్స్’ వంటి సంస్థలూ రాష్ట్రానికి కొత్త కాదు. టర్నోవర్ కోసం లేని వ్యాపారాన్ని చూపించామని స్వయంగా పన్ను అధికారుల ఎదుట ప్రస్తుతం కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న సుజనా చౌదరి అప్పట్లో అంగీకరించటమూ తెలియని విషయం కాదు. ఇక్కడ సుజనాతో పోలిక ఎందుకంటే ఇదీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంస్థే. దీన్లో ఉన్నదీ ఇన్వెస్టర్లే. అయితే సత్యం కంప్యూటర్స్ అంత పెద్దది కాదు కనక ఈ నకిలీ లెక్కలతో మోసపోయిన వారి సంఖ్య కూడా తక్కువే. అలాగే మాయ మాటలతో ఇన్వెస్టర్లకు సినిమా చూపించి ‘ఐపీవో’ ద్వారా వేల కోట్లు దోచేసిన సంస్థలూ ఉన్నాయి. లిస్టయిన దగ్గర్నుంచి ఒక్కరోజు కూడా తాము కొన్న ధరను కళ్ల చూడలేని ఇన్వెస్టర్లకే ఆ సంస్థల పవర్ అర్థమయ్యేది. మొత్తంగా చూస్తే ఇలాంటి వాటిలో సత్యం కూడా ఒకటి. అంతేతప్ప ఇది ‘ఒకే ఒక్కటి’ కాదనే అనుకోవాలి. అలా ఎగసి... ఇలా పతనమై.. 2009లో ఈ కుంభకోణం బయటపడక ముందు... రామలింగరాజు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బిల్‌గేట్స్. ఐటీకి దిక్సూచి. పద్నాలుగేళ్ల కిందట అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ కి ్లంటన్ హైదరాబాద్‌కు వచ్చినపుడు ఆయన పక్క సీటు రాజుదే. పశ్చిమగోదావరికి చెందిన ఈ రైతు బిడ్డ... 1977లో సత్యంను ఆరంభించాక... భవిష్యత్తును ముందే గమనించి నిర్ణయాలు తీసుకుంటూ ఆ కంపెనీని దేశ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. 1991లోనే అమెరికాకు ఆఫ్‌షోర్ సర్వీసులందించి ప్రథముడిగా నిలిచారు. ఇక 20వ శతాబ్దం అంతంలో కంప్యూటర్ల డేటా ఏమవుతుందో అన్న భయాలు చుట్టుముట్టినపుడు వై2కేకు పరిష్కారం అందించి సత్యంను అంతర్జాతీయంగా అగ్రస్థాయికి తీసుకెళ్లారు. సత్యం ఇన్ఫోవే ద్వారా ఇంటర్నెట్ బూమ్‌కు బాటలు వేశారు. 2001లో సత్యంను నాస్డాక్లో లిస్ట్ చేసి... 2006లో బిలియన్ డాలర్ల ఆదాయన్ని నమోదు చేసేలా తీసుకెళ్లారు. 2008 కల్లా రెండు బిలియన్ డాలర్లకు చేర్చారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. 2008 డిసెంబర్లోనే సత్యం పతనం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే మేటాస్‌కు చెందిన రెండు సంస్థలను కొనుగోలు డీల్‌ను వాటాదారులు వ్యతిరేకించటంతో వెనక్కి తీసుకున్నారు. అదే నెలలో డేటా చౌర్యం, బ్యాంకు అధికారులకు లంచమివ్వటం వంటి నేరాలపై ప్రపంచ బ్యాంకు సత్యంను 8 ఏళ్లపాటు తమ ప్రాజెక్టులు చేపట్టకుండా నిషేధించింది. ఈ చర్యలకు షేరు కుదేలైంది. అదే సమయంలో కుంభకోణం బయటపడింది. దీంతో సత్యంతో తన 22 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజు రాజీనామా చేసినా... అకౌంటింగ్ మోసాలు బయటపడటంతో జైలు తప్పలేదు. అకౌంటింగ్ మోసాలు ఇవీ... సెబీ దర్యాప్తు ప్రకారం... తప్పుడు ఆర్థిక సమాచార వల్ల కలిగిన నష్టం రూ.12,320 కోట్లు. ఒకే ఎగ్జిక్యూటివ్ పేరిట దాదాపు 7,561 నకిలీ బిల్లులు బయట పడ్డాయి. ఈ నకిలీ ఇన్వాయిస్ల ద్వారానే కంపెనీ ఆదాయం దాదాపు రూ.4,783 కోట్ల మేర పెంచి చూపించారు. నకిలీ రుణ దాతలు రూ.500 కోట్లు రుణాలిచ్చినట్లు చూపారు. నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్... రూ.1,732 కోట్లు నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లు... రూ.3,308 కోట్లు రావాల్సిన వడ్డీ (నకిలీ)... రూ.376 కోట్లు లెక్కల్లో చూపించని ఆదాయం... రూ.1,425 కోట్లు లెక్కల్లో చూపించని చెల్లింపులు... రూ.195 కోట్లు -
నేడు ‘సత్యం’ కుంభకోణం తీర్పు
-
సత్యం కేసులో తుది తీర్పు రేపే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కేసులో తుది తీర్పు గురువారం వెలువడనుంది. మార్చి 9వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ''ఏప్రిల్ 9న తీర్పు వెలువరిస్తాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఏప్రిల్ 9 తీర్పునకు చిట్టచివరి తేదీ అవుతుంది. ఇక వాయిదాల ప్రసక్తి లేదు. కోర్టు వేచి చూడదు'' అని ఆయన అప్పట్లో అన్నారు. 2009 జనవరి 7వ తేదీన సత్యం స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలను తప్పుగా చూపించి లేని లాభాలను లెక్కల్లో చెప్పినట్లు స్వయంగా కంపెనీ వ్యవస్థాపకుడు, నాటి ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రకటించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులను సీఐడీ విభాగం అధికారులు రెండు రోజుల తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. ఆరేళ్ల పాటు విచారణ సాగింది. -
కంపెనీల చట్టంలో సవరణలకు ఓకే
- లోక్‌సభలో ఆమోదముద్ర - పోంజీ స్కీమ్‌లకు అడ్డుకట్ట - కొన్ని నిబంధనల తొలగింపు న్యూఢిల్లీ: కంపెనీల చట్టం-2013లో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడం... వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం చట్టంలోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించినట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇలాంటి నిబంధనల కారణంగా దేశంలో వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎవరూ ముందుకురారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదిత కంపెనీల చట్టం సవరణ బిల్లు-2014కు సభలో మూజువాణి ఓటుతో అమోదం లభించినప్పటికీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును స్థాయీ సంఘానికి పంపాలంటూ కాంగ్రెస్ పట్టుపట్టగా.. స్పీకర్ నిరాకరించారు. మొత్తంమీద కంపెనీల చట్టానికి 14 సవరణలు చేశారు. ఇందులో పోంజీ స్కీమ్‌ల అడ్డుకట్టకూడా ప్రధానమైనది. లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లను ముంచేసిన శారదా చిట్‌ఫండ్ స్కామ్ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలను ఆశజూపి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేవారికి తీవ్రమైన శిక్షలను విధించేలా చట్టంలో మార్పులు చేశారు. కంపెనీలు ప్రారంభించాలంటే చాలా కష్టం: ఎంపీ వి.వరప్రసాద్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కంపెనీలు ప్రారంభించాలంటే కనీసం 40 చట్టాల నిబంధనలు పాటించాలని, అదే విదేశాల్లో అయితే ఈ ప్రక్రియ చాలా సులువని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. కంపెనీల చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ చట్ట సవరణలను చాలావరకు వైఎస్సార్సీపీ స్వాగతిస్తోంది. అయితే కంపెనీల బోర్డుల పలు తీర్మానాలు రహస్యంగా ఉంచుతారు. రిజిస్టర్లో నమోదు చేశాక రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంది? అంతర్జాతీయ ప్రక్రియలను అమల్లో పెడతామని మంత్రి చెప్పారు. కానీ అవి సవరణల్లో కనిపించలేదు. ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల ప్రయోజనాలనూ కాపాడాలి. సత్యం స్కామ్ తర్వాత ఆడిటర్లందరినీ అనుమానాస్పదంగా చూడడం మొదలైంది. కంపెనీలు దేశ సహజ సంపదను వినియోగించుకున్నప్పుడు వాటి లాభాలు ఈ దేశ సామాజిక రంగాలపై ఖర్చు చేసేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
-
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్‌కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్‌లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు. ఐదేళ్ల క్రితం.. అంటే 2009 సంవత్సరంలో సత్యం స్కాం బయటపడి ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా గ్రూపు ఛైర్మన్ రామలింగరాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాతి నుంచి పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు వెలువడింది. -
సెబీ ఆదేశాలపై శాట్‌కు ‘సత్యం’ రాజు
ముంబై: సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణంలో చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జించారంటూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జరిమానా, నిషేధం విధించడంపై ఆ కంపెనీ మాజీ వ్యవస్థాపక చైర్మన్ బి.రామలింగరాజు, మరో నలుగురు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. ఈ ఐదు వేర్వేరు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేదానిపై శాట్ నేడు(సోమవారం) విచారించనుంది. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంగా నిలిచిన ఈ కేసులో ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సెబీ జూలై 15న తుది ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సత్యం రాజు, ఆయన సోదరుడు బి. రామరాజు(అప్పటి సత్యం ఎండీ), కంపెనీ మాజీ సీఎఫ్ఓ వడ్డమాని శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి. రామకృష్ణ, అంతర్గత ఆడిట్ మాజీ హెడ్ వీఎస్ ప్రభాకర్ గుప్తాలు చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగివ్వాలంటూ ఆదేశించింది. వడ్డీని కూడా కలిపితే ఈ ఐదుగురు చెల్లించాల్సిన మొత్తం రూ.3 వేల కోట్లకుపైనే ఉంటుంది. 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని తమకు కట్టాల్సిందేనంటూ తేల్చిచెప్పడంతోపాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా 14 ఏళ్లపాటు నిషేధాన్ని కూడా వీరిపై సెబీ విధించింది. -
‘సత్యం’ను వెంటాడుతున్న పాత విదేశీ కేసులు
న్యూయార్క్: ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్.. మహీంద్రా గ్రూప్‌లో విలీనమైనప్పటికీ, పాత కేసులు దాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ తమను మభ్యపెట్టి భాగస్వామ్యం కుదుర్చుకునేలా చేసిందంటూ ఒకప్పటి భాగస్వామి వెంచర్ గ్లోబల్ ఇంజనీరింగ్ (వీజీఈ) తాజాగా మరోసారి దావా వేసింది. దీనిపై విచారణ జరపాలంటూ అమెరికాలోని అప్పీల్స్ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సత్యం కంప్యూటర్స్కి అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. పిటిషన్ వివరాల ప్రకారం.. ఆటో పరిశ్రమకు ఇంజినీరింగ్ సర్వీసులు అందించే ఉద్దేశంతో ల్యారీ వింగెట్ లివింగ్ ట్రస్టు సారథ్యంలోని వెంచర్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియాతో కలిసి 2000లో సత్యం.. జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసింది. అయితే, విభేదాలు రావడంతో 2005లో రెండూ తెగతెంపులు చేసుకున్నాయి. దీనికి సంబంధించి అప్పట్లో వెంచర్ సంస్థ వాదనలను తోసిపుచ్చి, జేవీలో ఆ కంపెనీకి ఉన్న వాటాలను సత్యంకు బదలాయించాలంటూ మిషిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది. అకౌంటింగ్ స్కాం దరిమిలా.. తాజాగా వెంచర్ సంస్థతో పాటు ట్రస్టు ప్రస్తుతం అప్పీల్స్ కోర్టుకెళ్లాయి. అప్పట్లో కూడా సత్యం తన ఆర్థిక స్థితిగతుల గురించి మాయమాటలు చెప్పి భాగస్వామ్యం కుదుర్చుకుందని వాదించాయి. దీనిపైనే కోర్టు ప్రస్తుత ఆదేశాలు జారీ చేసింది.