
దాచినా దాగని ‘సత్యం’
- రాజు కుటుంబీకులతో పాటు అప్పట్లో కొన్నవారికీ లాభాలు
- ఐదారేళ్లపాటు నకిలీ లెక్కలు కొనసాగినా గుర్తించని ఆడిటర్లు
- మేటాస్ డీల్ ఓకే అయి ఉంటే స్కామ్ బయటపడేదే కాదు!!
- రియల్టీ విలువలు తగ్గినపుడు ఈ నిర్ణయం తీసుకోవటమూ ఓ కారణమే
సాక్షి బిజినెస్ విభాగం
సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలో భారీగా దెబ్బతిన్నది, నష్ట పోయింది ఎవరైనా ఉంటే ఆ కంపెనీ షేర్లు కొనుక్కుని... కుంభ కోణం బయటపడ్డ వెంటనే భయంతో అమ్మేసిన ఇన్వెస్టర్లే. ఎందుకంటే రూ.540 చూసిన సత్యం షేరు... ఆ పతనంలో రూ.12కు పడిపోయింది. మరి మోసపూరిత లెక్కలతో లేని ఆస్తుల్ని, రాని లాభాల్నే కాక, లేని ఉద్యోగులను కూడా చూపించి షేరు విలువను అమాంతం పెంచేసిన ఈ వ్యవహారంలో లాభపడిందెవరు? అలా పెరిగిన సందర్భాల్లో వాటాలమ్ముకున్న ప్రతి ఒక్కరూ లబ్ధిదారులే.
వారిలో ముందున్నది సత్యం వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సంబంధీకులే. గురువారం ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటిస్తూ ‘‘ఇలాంటి నేరాల్లో శిక్షను ప్రకటించేటపుడు నేరగాళ్ల చర్యల ద్వారా దెబ్బతిన్న వారి ఆవేదనను దృష్టిలో పెట్టుకోవాలి’’ అని చెప్పింది కూడా అందుకే. అయితే ప్రభుత్వ వేలంలో వాటా కొనుక్కుని విలువైన కంపెనీని తక్కువ మొత్తానికే చేజిక్కించుకున్న టెక్ మహీంద్రా కూడా లాభపడినట్టే చెప్పుకోవాలి.
ఐదారేళ్లుగా ఆడిటర్లేం చేసినట్లు?
సత్యం వ్యవహారంలో గమనించాల్సినవెన్నో ఉన్నాయి. దాదాపు ఐదారేళ్లపాటు రాని ఆదాయాన్ని వచ్చినట్టుగా చూపిస్తూ వచ్చిన రామలింగరాజు... బ్యాంకు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వడ్డీతో సహా అన్నీ నకిలీ లెక్కలే చూపించారు. ఇలా నకిలీ మొత్తం రూ.5,040 కోట్లకు చేరుకోవటంతో దీనికి ముగింపు పలకాలనుకున్నారు. అందుకే తన కుటుంబానికి చెందిన మేటాస్ ఇన్‌ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్‌ను రూ.7,680 కోట్లకు కొనుగోలు చేసేలా సత్యం తరఫున తానే నిర్ణయం తీసుకున్నారు. ఆ డీల్ ఓకే అయితే అందులో రూ.5,040 కోట్లను మేటాస్‌కు చెల్లించకుండానే చెల్లించినట్లు చూపించాలని... అపుడు సత్యంలో కృత్రిమ లెక్కలకు తెరవేయవచ్చనేది ఆయన ఆలోచన.
అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా! ఈ మోసం ఎన్నటికీ బయటపడేది కాదేమో!! మరికొందరు చెబుతున్నట్లుగా రామలింగరాజు కనక మేటాస్ డీల్ నిర్ణయాన్ని 2009 జనవరిలో కాకుండా రియల్ ఎస్టేట్ ధరలు పతాక స్థాయిలో ఉన్న ఏ 2007 ఆఖర్లోనో, 2008 జనవరిలోనో తీసుకుంటే అంతా ఆ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో ఆమోదించేవారేమో!! సరే! ఈ విషయాన్ని పక్కనబెడితే ఐదారేళ్లపాటు ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నపుడు ఆడిటర్లేం చేశారనేదీ ప్రశ్నే. కార్పొరేట్ వ్యవస్థకు పోలీసు ల్లాంటి ఆడిటర్లే విఫలమైతే ఏమనుకోవాలి? ఎందుకంటే అంతకు ముందటి సంవత్సరమే... అంటే 2008లో ఉత్తమ కార్పొరేట్ పాలనకు గాను సత్యంకు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డుతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది కూడా!!.
‘సత్యం’ ఒక్కటే కాదు..
సత్యం కుంభకోణం బయటపడ్డపుడు... ఇలా లాభాల్ని పెంచి చూపిస్తూ ఖాతాల్లో మోసాలకు తెరతీస్తున్న సంస్థలు చాలా ఉన్నాయని, మరెన్నో ‘సత్యం’లు బయటపడతాయని కార్పొరేట్ నియంత్రణ సంస్థలు వ్యాఖ్యానించటం తెలియనిది కాదు. సదరు ప్రమోటర్లు జాగ్రత్తపడ్డారో, నియంత్రణ సంస్థలు నెమ్మదించాయో కానీ ఆ తరవాత ఇలాంటివేవీ బయటపడలేదు. అయితే రాని లాభాల్ని చూపించిన తరహాలోనే లేని వ్యాపారాన్ని చూపించిన ‘సుజనా మెటల్స్’ వంటి సంస్థలూ రాష్ట్రానికి కొత్త కాదు. టర్నోవర్ కోసం లేని వ్యాపారాన్ని చూపించామని స్వయంగా పన్ను అధికారుల ఎదుట ప్రస్తుతం కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న సుజనా చౌదరి అప్పట్లో అంగీకరించటమూ తెలియని విషయం కాదు.
ఇక్కడ సుజనాతో పోలిక ఎందుకంటే ఇదీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంస్థే. దీన్లో ఉన్నదీ ఇన్వెస్టర్లే. అయితే సత్యం కంప్యూటర్స్ అంత పెద్దది కాదు కనక ఈ నకిలీ లెక్కలతో మోసపోయిన వారి సంఖ్య కూడా తక్కువే. అలాగే మాయ మాటలతో ఇన్వెస్టర్లకు సినిమా చూపించి ‘ఐపీవో’ ద్వారా వేల కోట్లు దోచేసిన సంస్థలూ ఉన్నాయి. లిస్టయిన దగ్గర్నుంచి ఒక్కరోజు కూడా తాము కొన్న ధరను కళ్ల చూడలేని ఇన్వెస్టర్లకే ఆ సంస్థల పవర్ అర్థమయ్యేది. మొత్తంగా చూస్తే ఇలాంటి వాటిలో సత్యం కూడా ఒకటి. అంతేతప్ప ఇది ‘ఒకే ఒక్కటి’ కాదనే అనుకోవాలి.
అలా ఎగసి... ఇలా పతనమై..
2009లో ఈ కుంభకోణం బయటపడక ముందు... రామలింగరాజు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బిల్‌గేట్స్. ఐటీకి దిక్సూచి. పద్నాలుగేళ్ల కిందట అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ కి ్లంటన్ హైదరాబాద్‌కు వచ్చినపుడు ఆయన పక్క సీటు రాజుదే. పశ్చిమగోదావరికి చెందిన ఈ రైతు బిడ్డ... 1977లో సత్యంను ఆరంభించాక... భవిష్యత్తును ముందే గమనించి నిర్ణయాలు తీసుకుంటూ ఆ కంపెనీని దేశ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. 1991లోనే అమెరికాకు ఆఫ్‌షోర్ సర్వీసులందించి ప్రథముడిగా నిలిచారు. ఇక 20వ శతాబ్దం అంతంలో కంప్యూటర్ల డేటా ఏమవుతుందో అన్న భయాలు చుట్టుముట్టినపుడు వై2కేకు పరిష్కారం అందించి సత్యంను అంతర్జాతీయంగా అగ్రస్థాయికి తీసుకెళ్లారు.
సత్యం ఇన్ఫోవే ద్వారా ఇంటర్నెట్ బూమ్‌కు బాటలు వేశారు. 2001లో సత్యంను నాస్‌డాక్‌లో లిస్ట్ చేసి... 2006లో బిలియన్ డాలర్ల ఆదాయన్ని నమోదు చేసేలా తీసుకెళ్లారు. 2008 కల్లా రెండు బిలియన్ డాలర్లకు చేర్చారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. 2008 డిసెంబర్లోనే సత్యం పతనం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే మేటాస్‌కు చెందిన రెండు సంస్థలను కొనుగోలు డీల్‌ను వాటాదారులు వ్యతిరేకించటంతో వెనక్కి తీసుకున్నారు. అదే నెలలో డేటా చౌర్యం, బ్యాంకు అధికారులకు లంచమివ్వటం వంటి నేరాలపై ప్రపంచ బ్యాంకు సత్యంను 8 ఏళ్లపాటు తమ ప్రాజెక్టులు చేపట్టకుండా నిషేధించింది. ఈ చర్యలకు షేరు కుదేలైంది. అదే సమయంలో కుంభకోణం బయటపడింది. దీంతో సత్యంతో తన 22 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజు రాజీనామా చేసినా... అకౌంటింగ్ మోసాలు బయటపడటంతో జైలు తప్పలేదు.
అకౌంటింగ్ మోసాలు ఇవీ...
సెబీ దర్యాప్తు ప్రకారం... తప్పుడు ఆర్థిక సమాచార వల్ల కలిగిన నష్టం రూ.12,320 కోట్లు.
ఒకే ఎగ్జిక్యూటివ్ పేరిట దాదాపు 7,561 నకిలీ బిల్లులు బయట పడ్డాయి.
ఈ నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారానే కంపెనీ ఆదాయం దాదాపు రూ.4,783 కోట్ల మేర పెంచి చూపించారు.
నకిలీ రుణ దాతలు రూ.500 కోట్లు రుణాలిచ్చినట్లు చూపారు.
నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్... రూ.1,732 కోట్లు
నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు... రూ.3,308 కోట్లు
రావాల్సిన వడ్డీ (నకిలీ)... రూ.376 కోట్లు
లెక్కల్లో చూపించని ఆదాయం... రూ.1,425 కోట్లు
లెక్కల్లో చూపించని చెల్లింపులు... రూ.195 కోట్లు