సత్యం కేసులో తుది తీర్పు రేపే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కేసులో తుది తీర్పు గురువారం వెలువడనుంది. మార్చి 9వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ''ఏప్రిల్ 9న తీర్పు వెలువరిస్తాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఏప్రిల్ 9 తీర్పునకు చిట్టచివరి తేదీ అవుతుంది. ఇక వాయిదాల ప్రసక్తి లేదు. కోర్టు వేచి చూడదు'' అని ఆయన అప్పట్లో అన్నారు.
2009 జనవరి 7వ తేదీన సత్యం స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలను తప్పుగా చూపించి లేని లాభాలను లెక్కల్లో చెప్పినట్లు స్వయంగా కంపెనీ వ్యవస్థాపకుడు, నాటి ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రకటించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులను సీఐడీ విభాగం అధికారులు రెండు రోజుల తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు బెయిల్పై బయటే ఉన్నారు. ఆరేళ్ల పాటు విచారణ సాగింది.