
'సత్యం స్కామ్ వెనుక చంద్రబాబు హస్తం'
సత్యం కుంభకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందేమోనన్న అనుమానాలున్నాయని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మరణించిన నేతలపై కాకుండా సత్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. సత్యం కుంభకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందేమోనన్న అనుమానాలున్నాయని అన్నారు. ఇక.. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక వెంకయ్య నాయుడు ఆస్తులు పెరిగాయని వీహెచ్ ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వెంకయ్యనాయుడు కుమార్తె భారీగా సంపాదిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ఆయన కుటుంబ ఆస్తులపై విచారణ జరుగుతుందని చెప్పారు.
భూసేకరణ ఆర్డినెన్స్ అంశంలో బీజేపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాతలు ఆగ్రహజ్వాల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారంటూ బీజేపీ సర్కారు నాటకమాడుతోందని విమర్శించారు.