13లో స్పందించినవి 3 | Sebi softens stand as 'shell firms' move Securities Appellate Tribunal | Sakshi
Sakshi News home page

13లో స్పందించినవి 3

Published Thu, Aug 10 2017 1:21 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

13లో స్పందించినవి 3

13లో స్పందించినవి 3

సెబీ చర్య సరికాదన్నసైబర్‌మేట్, ఫ్రాంటియర్, ఫార్మాక్స్‌
మిగిలినవి అడ్రస్‌ లేని పరిస్థితే
సంప్రతించటానికి ‘సాక్షి’ చేసిన ప్రయత్నాలు విఫలం



హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: షెల్‌ కంపెనీలుగా సెబీ ముద్ర వేయటంపై పలు సంస్థలు బుధవారం సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. మరికొన్ని బీఎస్‌ఈకి, సెబీకి తమ వ్యతిరేకత తెలియజేస్తూ లేఖలు పంపాయి. నిజం చెప్పాలంటే సెబీ విడుదల చేసిన 331 కంపెనీల జాబితాలో చాలావరకూ డొల్ల కంపెనీలే. అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లు కూడా లేకుండా... స్టాక్‌ మార్కెట్లో మాత్రం షేర్ల లావాదేవీలు దివ్యంగా జరుపుతున్నవే. కాకపోతే సెబీ జాబితాలో ప్రకాష్‌ ఇండస్ట్రీస్, జెకుమార్‌ ఇన్‌ఫ్రా వంటి దాదాపు డజనుకు పైగా కంపెనీలు మంచి మార్కెట్‌ విలువతో పాటు చక్కని లాభాలార్జిస్తున్నవి కావటం గమనార్హం. ఇలాంటి వాటిని కూడా షెల్‌ జాబితాలో వేసేయటంతో పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవటమే కాక... కొన్ని కంపెనీలు న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించాల్సి వచ్చింది.

ఈ 331 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి దాదాపు 13 వరకూ ఉన్నాయి. ఇవి నిజంగా షెల్‌ కంపెనీలేనా? వీటిని ఎందుకు జాబితాలో చేర్చారు? అసలు వీటి చిరునామాలు సరైనవేనా? వీటికి తాడూ బొంగరం ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవటానికి బుధవారం ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అడ్రస్‌ ఉండి... స్పందించినవి మూడే కావటం గమనార్హం. మిగిలిన వాటి ఫోన్‌ నెంబర్లే కాదు... ఆచూకీ సైతం తెలియరాలేదు. ఆ వివరాలు చూస్తే...

‘‘మేం కంపెనీల చట్టం ప్రకారం ప్రతి నిబంధననూ పాటిస్తున్నాం. ఆదాయపు పన్ను, సేవా పన్ను క్రమం తప్పకుండా కడుతున్నాం. మాది షెల్‌ కంపెనీ కాదు. మాకు ఏ షెల్‌ కంపెనీతోనూ సంబంధాలు కూడా లేవు. మాకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) గుర్తింపు ఉంది. మా పేరు షెల్‌ కంపెనీల జాబితాలో రావటం విస్మయానికి గురి చేసింది’’ అని సైబర్‌మేట్‌ ఇన్ఫోటెక్‌ ప్రతినిధి చెప్పారు. ఇదే విషయాన్ని సంస్థ బీఎస్‌ఈకి కూడా వెల్లడించింది. 30 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని, ఏ రోజూ తప్పుడు పనిచేయలేదని ఫ్రాంటియర్‌ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రతినిధి తెలిపారు. ‘ముందస్తు నోటీసు లేకుండా సెబీ ఈ చర్య తీసుకోవడం అన్యాయం. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఐటీ కంపెనీ మాదే. 2,000 మందికిపైగా ఉపాధి కల్పించాం. ఇప్పుడిలా ఎందుకు జరిగిందో అంతుపట్టడం లేదు’ అని ఆయన వాపోయారు.

జీడీఆర్‌ కేసులో ఫార్మాక్స్‌..
గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) జారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్మాక్స్‌ ఇండియా సైతం  అనుమానిత షెల్‌ కంపెనీల జాబితాలో ఉంది. ‘‘జీడీఆర్‌ జారీ ప్రక్రియలో అల్టా విస్టా ఇంటర్నేషనల్‌ సంస్థ మమ్మల్ని మోసం చేసింది. ఆ కంపెనీ ఎండీ అరుణ్‌ పంచరియాపై చర్యలు తీసుకోవాలని మేం గతంలో దాఖలు చేసిన పలు కేసులు పెండింగులో ఉన్నాయి. మేమెలాంటి అవకతవకలకూ పాల్పడలేదు’’ అని సంస్థ ప్రతినిధి చెప్పారు.

వీటి చిరునామాలూ తప్పేనా?
మిగిలిన సంస్థల్లో సొంత వెబ్‌సైట్, ఫోన్‌ నంబర్‌ లేని కంపెనీలే ఎక్కువ. ఇన్నాళ్లూ బీఎస్‌ఈకి ఫైల్‌ చేసిన పత్రాల్లో పేర్కొన్న ఫోన్‌ నంబర్లు కూడా  పనిచేయడం లేదు. కొన్ని నంబర్లు పనిచేస్తున్నా అటు నుంచి స్పందన లేదు. ప్రొసీడ్‌ ఇండియా పేరిట వెబ్‌సైట్‌ పనిచేస్తున్నా... ఆ వెబ్‌సైట్లో పేర్కొన్న ఫోన్‌ నెంబరు మాత్రం పనిచేయటం లేదు. యంత్ర నేచురల్‌ రిసోర్సెస్‌దీ అదే పరిస్థితి. ఇక త్రినేత్ర ఇన్‌ఫ్రా వెంచర్స్‌ జాడే లేదు. ఎల్‌ఎన్‌ ఇండస్ట్రీస్‌ ఇండియాకు వెబ్‌సైట్‌ లేకపోగా బీఎస్‌ఈకి ఇచ్చిన నంబరూ పనిచేయడం లేదు. వెన్‌మ్యాక్స్‌ డ్రగ్స్, జీఆర్‌ కేబుల్స్‌కు సంబంధించి వాటి ప్రతినిధుల్ని వివిధ మార్గాల్లో  సంప్రతించే ప్రయత్నాలు చేసినా అట్నుంచి స్పందన లేదు. పాల్కో లిమిటెడ్‌ ల్యాండ్‌లైన్‌ నంబరు ప్రస్తుతం ఓ న్యాయవాది వద్ద ఉంది. చాలా రోజుల క్రితమే టెలికం కంపెనీ తమకు ఈ నంబరు కేటాయించిందని ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement