జిల్లా కేంద్రమే.. గీటురాయి
♦ పునర్విభజనలో తెరపైకి జీఐఎస్ మ్యాపింగ్
♦ జిల్లా కేంద్రం నుంచి 70 కి.మీ. పరిధి నిర్ధారణ
♦ కొత్తగా జిల్లాలో 11 మండలాలకు గ్రీన్‌సిగ్నల్
♦ రెవెన్యూ డివిజన్ల పెంపు ఇప్పట్లో లేనట్లే
మండలాల పునర్విభజనకు లైన్ క్లియరైంది. జిల్లాలో కొత్తగా 11 మండలాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.ఎంసీహెచ్‌ఆర్‌డీలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కలెక్టర్ల వర్క్‌షాప్‌లో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పరిపాల నా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలో అదనంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలనే జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ప్రతిపాదనలకు సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా, ఇప్పటికే ఐదు రెవెన్యూ డివిజన్లు ఉన్నందున.. కొత్త డివిజన్ల అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి మండలంలో దాదాపు ఒకే నిష్పత్తిలో జనాభా, మండల కేంద్రం నుంచి దూరాన్ని కూడా కొలమానంగా తీసుకొని మండలాలను పునర్విభజించారు. అంతేకాకుండా మండలాల పునర్విభజనలో భూ పరిపాలనాశాఖ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. జీఐఎస్ సాఫ్ట్‌వేర్ మ్యాపింగ్ ద్వారా ప్రతిపాదిత మండలాల రేఖాచిత్రాలను గీసింది.
కలెక్టర్ల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని నిర్దేశిత మండలాల సరిహద్దులు, మండల పరిధిలోకి వచ్చే గ్రామాలు, కొత్తగా కలిపే గ్రామాలు, జనాభా, ఇతర వనరులు తదితర అంశాలతో కూడిన మ్యాపింగ్ ను అక్కడికక్కడే ప్రదర్శించింది. తద్వారా మండలాల విభజనలో శాస్త్రీయత పాటించలేదనే విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఈ జీఐఎస్ సాఫ్ట్‌వేర్ మ్యాపింగ్ విధానాన్ని నగర శివారులో ప్రాంతాల్లో అమలు చేయకూడదని నిర్ణయించింది.
కొత్త మండలాలు ఇవే..!
జిల్లాలో ప్రస్తుత 37 మండలాలకు అదనంగా మరో 11 మండలాలు ఏర్పడనున్నాయి. వీటిలో అధికశాతం పట్టణ మండలాలే ఉన్నాయి. రెవెన్యూ వివాదాలు, సిబ్బందిపై పనిభారం కారణంగా అదనంగా అర్బన్ మండలాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి తాజాగా జరిగిన సమావేశంలో మోక్షం కలిగింది. ప్రస్తుత మండలాల పరిధిని వర్గీకరించడం ద్వారా అల్వాల్, దొమ్మరపోచంపల్లి, జవహర్‌నగర్, కాప్రా, పెద్దషాపూర్, అబ్దుల్లాపూర్, కూకట్‌పల్లి, మీర్‌పేట/ బడంగ్‌పేట, మాదాపూర్/ కొండాపూర్, నార్సింగి, మేడిపల్లి మండలాలుగా ఆవిర్భవించనున్నాయి.
జిల్లాలపై సస్పెన్స్
జిల్లాల పునర్వ్యస్థీకరణపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతునే ఉంది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో జిల్లాల ముఖచిత్రం ఖ రారు కానుంది. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే అంశంపై ఎలాంటి వివాదం లేకున్నా, శివారు ప్రాంతాలను ఎక్కడ కలపాలనే విషయంపై మాత్రం ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 23 లేదా 24 జిల్లాలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా ఆదిలాబాద్ నుంచి జిల్లాల విభజన ప్రక్రియను మొదలు పెడతారని, ఆ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్‌లలో జిల్లాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే ది ఆధారపడి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. కాగా, జిల్లా కేంద్రం 70 కిలోమీటర్ల దూరం వరకు జిల్లా పరిధిని ప్రభుత్వం నిర్ధేశించింది.
దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రం కొత్త జిల్లా ఏర్పాటులో కీలకం కానుంది. జిల్లా కేంద్రాన్ని గీటురాయిగా చేసుకొని జీఐఎస్ సాఫ్ట్‌వేర్(టూల్)తో నయా జిల్లా సరిహద్దులు రూపొందించనున్నారు. తద్వారా ఆ జిల్లా పరిధిలోకి వచ్చే జనాభా, జలవనరులు, రైల్వేలైన్లు, జాతీయ రహదారులు, ఇతరత్రా వనరులు క్షణాల్లో మ్యాపింగ్ అవుతాయి. దీంతో ఆ పరిధిలోకి వచ్చే పొరుగు జిల్లాల పరిధిలోని మండలాలు కూడా ఇందులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఇక్కడి ప్రాంతాలు పక్క జిల్లా పరిధిలోకి వెళ్లే వీలు లేకపోలేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నేడు జరిగే వర్క్‌షాప్‌లో సీఎం కొత్త జిల్లాలను కొలిక్కి తేనున్నారు. అయితే, జిల్లా కేంద్రమే ఈ వ్యవహారంలో దిక్సూచి కానున్నందున.. రాజకీయ నిర్ణయం మేరకు కొత్త జిల్లాలు పురుడు పోసుకునే అవకాశముంది.