హ్యుందాయ్, స్విగ్గీ భారీ ఆఫర్లకు సెబీ లైన్‌క్లియర్
హ్యుందాయ్ మెగా ఇష్యూ @ రూ. 25,000 కోట్లు
పూర్తయితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్
స్విగ్గీ రూ. 11,700 కోట్ల పబ్లిక్ ఆఫర్ నవంబర్లో...
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది.
దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్‌ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.
రెండు దశాబ్దాల తర్వాత...
దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు.
స్విగ్గీ డెలివరీ రెడీ...
ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా.
2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment