న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్‌టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్లు, ఇతరత్రా షేర్‌హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.
రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు ..
ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్‌కు రూబీకాన్ రీసెర్చ్‌లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.
మరోవైపు, సనాతన్ టెక్స్‌టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్‌కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.
అటు మెటల్‌మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్‌లోని పిథంపూర్‌లో 2వ యూనిట్‌లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment