
20 స్టేషన్లు.. 5 జోన్లు
కమిషనరేట్ పునర్‌వ్యవస్థీకరణపై పోలీసు పెద్దల దృష్టి
ప్రతిపాదనల రూపకల్పనలో ఉన్నతాధికారులు
ప్రస్తుతం ఉన్న మూడు జోన్ల విస్తరణ
ఒక్కో జోన్‌లో 4 నుంచి 5 స్టేషన్లు
విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్ పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని నగరంగా రూపొందడం, పాలనా వ్యవహారాలు ఇక్కడి నుంచే సాగుతుండటంతో పునర్‌వ్యవస్థీకరణపై పోలీసు పెద్దలు దృష్టి పెట్టారు. అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు ముందే కమిషనరేట్‌ను పునర్‌వ్యవస్థీకరించి సబ్ డివిజన్ల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న పరిధిలోనే కొత్త సబ్ డివిజన్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే రూరల్‌లో మరో రెండు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నగరంలో మంగళవారం జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పోలీస్ కమిషనరేట్ పునర్‌వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి చర్చలు జరిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి వెంటనే ప్రభుత్వ ఆమోదం పొందాలని అధికారులు నిర్ణయించారు. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కీలక సబ్ డివిజన్ల బాధ్యతలను ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ కిందకు తేవాలనేది అధికారుల నిర్ణయం.
పునర్‌వ్యవస్థీకరిస్తే ఇలా...
ఇప్పుడున్న 20 పోలీస్‌స్టేషన్లతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి ఐదు సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క డివిజన్‌లో నాలుగు నుంచి ఐదు పోలీస్‌స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. రూరల్‌లోని పెద్ద పోలీస్‌స్టేషన్లను విడదీసి కొత్త స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వన్‌టౌన్, టూ టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం స్టేషన్లు పశ్చిమ, కంకిపాడు, ఉయ్యూరు సర్కిల్స్‌లోని స్టేషన్లను ఈస్ట్‌జోన్‌కు కలిపే అవకాశం ఉంది. కృష్ణలంక, గవర్నరుపేట, సూర్యారావుపేట, మాచవరం స్టేషన్లు సౌత్‌జోన్, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, నున్న రూరల్‌తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రామవరప్పాడు పోలీస్‌స్టేషన్ నార్త్‌జోన్, పటమట, పెనమలూరు, గన్నవరం స్టేషన్లు సెంట్రల్ జోన్‌లోకి రానున్నట్టు తెలిసింది. అవసరమైన పక్షంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రతిపాదిత జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని కమిషనరేట్ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా కీలక ప్రాంతాలు ఉండే సబ్ డివిజన్లకు ఐపీఎస్ అధికారిని ఏసీపీగా నియమించనున్నారు. ఐదింటిలో మూడింటికి ఐపీఎస్‌లు ఏసీపీలుగా వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటికే సానుకూల సంకేతాలు వచ్చినందున కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదింప చేసుకునే యోచనలో ఉన్నారు.
ఇప్పుడిలా...
1989లో ఏర్పడిన కమిషనరేట్‌ను 2006లో ఒకసారి పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు వరకు రెండు సబ్ డివిజన్లు మాత్రమే ఉండగా, మూడు సబ్ డివిజన్లకు పెంచారు. ఆ తర్వాత పోలీసు కమిషనరేట్‌లో 20 పోలీస్‌స్టేషన్లు ఉండగా ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి. వెస్ట్ జోన్ పరిధిలో గవర్నరుపేట, సూర్యారావుపేట, వన్‌టౌన్, టూ టౌన్, ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్లు ఉండగా, గత ఏడాది ప్రారంభంలో ఏర్పాటుచేసిన భవానీపురం పోలీస్‌స్టేషన్‌ను చేర్చారు. సెంట్రల్ జోన్‌లో కృష్ణలంక, మాచవరం, పటమట, సత్యనారాయణపురం, నున్న రూరల్ పోలీస్‌స్టేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అజిత్‌సింగ్‌నగర్ స్టేషన్‌ను కలిపారు. రూరల్‌లోని పెనమలూరు, గన్నవరం పోలీస్‌స్టేషన్లతో పాటు కంకిపాడు, ఉయ్యూరు సర్కిల్స్‌తో ఈస్ట్‌జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జోన్‌కు ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏసీపీగా వ్యవహరిస్తుండగా, వెస్ట్‌కు ర్యాంకర్, సెంట్రల్‌కు డెరైక్ట్ డీఎస్పీలు ఏసీపీలుగా వ్యవహరిస్తున్నారు.