
ఖేడ్ లో ‘పునర్విభజన’ చిచ్చు..
♦ సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్
♦ మెదక్ జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన బాట
నారాయణఖేడ్: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలుపుతారనే వార్తలు రావడంతో నియోజకవర్గంలో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.ప్రస్తుతం ఉన్న జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఖేడ్ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడే సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయపార్టీలు ఖేడ్‌ను మెదక్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఖేడ్‌ను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది. మంత్రి హరీశ్‌రావు ఇటీవల ఖేడ్‌ను డివిజన్ కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఖేడ్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాల్లో ఖేడ్‌ను మెదక్ జిల్లాలో విలీనం చేస్తారనే పిడుగులాంటి వార్తను మాత్రం ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సంగారెడ్డితోనే సంబంధాలు..
ఏళ్లుగా నారాయణఖేడ్ వాసులకు సంగారెడ్డితోనే సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు చాలామంది సంగారెడ్డిలో నివాసమేర్పరుచుకోవడమే కాకుం డా అక్కడే స్థలాలను కూడా కొనుగోలు చేశారు. వ్యాపారం, ఆస్పత్రులు, తదితర పనులన్నింటీకీ ప్రధానంగా హైదరాబాద్‌పై ఆధారపడతారు. ఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంమధ్యలోనే సంగారెడ్డి ఉంటుంది. దీంతో సంగారెడ్డికి, రాజధానికి వెళ్లేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంది. అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండడంతో సంగారెడ్డి పట్టణంతోనే మేకమయ్యారు. మెదక్ ప్రాంతం తో ఈ ప్రాంత ప్రజలకు అంతగా సంబంధాలు లేవు.
కేవలం పోలీసు డివిజన్ మాత్రమే మెదక్‌లో ఉండడంతో ఆ పనులపై వెళ్లివచ్చేందుకే నానా తంటాలు పడతారు. మెదక్ వెళ్లేందుకు సరియైన రవాణా సదుపాయాలు కూడా లేవు. ఖేడ్ నుంచి సంగారెడ్డికి రోజులో రెండు మూడు మార్లు వెళ్లివచ్చే వీలుంది. అదే మెదక్ వెళ్లాలంటే ఒక రోజంతా పడుతుంది. సంగారెడ్డికి నారాయణఖేడ్ నుం చి 80 కిలోమీటర్లు. మెదక్‌కు 45 కిలోమీటర్ల దూరం ఉన్నా ఆ ప్రాంతంలో ఎలాం టి ప్రయోజనంలేదు. అవసరమైతే ఖేడ్ వాసులు బీదర్ ప్రాంతానికి వెళ్తారు కానీ మెదక్ వెళ్లరు. అలాంటి మెదక్‌లో ఖేడ్‌ను విలీనం చేస్తామనడంతో అన్ని వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొందరు ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఖేడ్‌ను చేయాలని కోరుతున్నారు.