
నిజామాబాద్ ట్రెజరీలో కొట్లాట
ఇందూరు: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు విషయం నిజామాబాద్ జిల్లా ట్రెజరీ శాఖలో డీడీ, ఉద్యోగుల మధ్య సోమవారం వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ ఎస్టీవో చేతికి గాయమైంది. కొత్తగా ఏర్పాటవుతున్న కామారెడ్డి జిల్లా కోసం ట్రెజరీ ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్ర ట్రెజరీ అధికారుల ఆదేశాల ప్రకారం డీడీ ఓ జాబితాను రాష్ట్ర అధికారులకు పంపినట్లు సమాచారం. జాబితాలో డీడీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులనే జిల్లాలకు కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపించారంటూ ట్రెజరీ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.గంగాధర్, ఇతర నాయకులు డీడీ గదిలోకి వెళ్లి, ఆ వివరాలను నోటీసు బోర్డుపై పెట్టాలని కోరారు.
జాబి తాను బయట పెట్టబోమని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లి పని చేయాలని డీడీ స్పష్టం చేశారు. ఇదే విషయమై డీడీ, ఉద్యోగులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, అనంతరం తోపులాట జరిగింది. ఉద్యోగులను పక్కకు తోసుకుంటూ డీడీ వెళ్తుండగా, ఎస్టీవో గంగాధర్ చేతికి గాయమైంది. దీంతో ఉద్యోగు లు ఆగ్రహంతో డీడీపై దాడికి పాల్పడి చొక్కాను పట్టుకున్నట్లు తెలిసింది. బయట ఉన్న ఉద్యోగులు వచ్చి సర్దిచెప్పారు. ఉద్యోగులు తనపై దాడి చేశారనే మనస్తాపంతో డీడీ రామకృష్ణ అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాడి విషయాన్ని రాష్ట్ర ట్రెజరీ శాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఇన్‌చార్జి డీడీగా యాదగిరి: నిజామాబాద్ జిల్లా ట్రెజరీ శాఖ కార్యాలయానికి ఇన్‌చార్జి డిప్యూటీ డెరైక్టర్(డీడీ)గా హైదరాబాద్ ట్రెజరీ డీడీ యాదగిరికి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ట్రెజరీ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.