సాక్షి, హైదరాబాద్ : నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండు కీలక ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.
సాగునీటి రంగం బలోపేతానికి..
‘రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని గుర్తించిన కేసీఆర్, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్త తం నీటిపారుదల శాఖ శాఖోపశాఖలుగా ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15–20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ)ని ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు సమస్తం ఉంటాయి.
దీనికి సంబంధించి ముసా యిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ 2రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌షాపు నిర్వహించి, ముసాయిదా రూపొందించారు. దీనిని సోమ వారం సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తారు. దీనిపై సమీక్ష సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణ యం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
సచివాలయం ఎలా ఉండాలి?
తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై, సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment