తెలంగాణలో ఆంక్షలకు వేళాయె! | CM KCR Review Meeting About Corona Virus Omicron Variant In Telangana | Sakshi
Sakshi News home page

Covid Restrictions In Telangana: ఆంక్షలకు వేళాయె!

Published Mon, Jan 17 2022 3:00 AM | Last Updated on Mon, Jan 17 2022 2:44 PM

CM KCR Review Meeting About Corona Virus Omicron Variant In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కేసుల ఉధృతి పెరిగి, మూడో వేవ్‌ మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షల విధింపునకు రంగం సిద్ధమైంది. కరోనా పరిస్థితులు, ముందు జాగ్రత్త చర్యలపై మంత్రివర్గం సోమవారం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీకానుంది. ఇందులో కరోనా అంశాలతోపాటు వ్యవసాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఏం చేస్తే బాగుంటుంది?
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ అధికారులతో కేబినెట్‌ సమీక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్యసేవల ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన ఆదేశాలు జారీ చేయనుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక కరోనా కట్టడికోసం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో కేసుల ఉధృతి పెరుగుతుండడంతో.. వారాంతపు కర్ఫ్యూతోపాటు రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

అక్కడ రెస్టారెంట్లు, బార్లను మూసివేసి.. కేవలం పార్శిల్‌ సేవలకే అనుమతి ఇచ్చారు. యూపీ,  ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించలేదు. అయితే ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉంటుండటం ఊరటనిచ్చే అంశమని, ఇక్కడ ఎలాంటి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. ఇతర జిల్లాల్లో

రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవని, గతంలో రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పుడు పెద్దగా ప్రయోజనం కలగలేదని గుర్తు చేస్తున్నాయి. ఒమిక్రాన్‌తో కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండటంతో కొత్త ఆంక్షల విధింపుపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేస్తున్నాయి. అన్నిరకాల ర్యాలీలు, జన సామూహిక కార్యక్రమాలపై విధించిన నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్య చికిత్సలు, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, టెస్టుల సంఖ్య పెంపు, రెండో డోసు వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయడం, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లతో పాటు 65ఏళ్లుపై బడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బూస్టర్‌ డోసులు వేయడం, హైదరాబాద్‌ నలువైపులా కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని పేర్కొన్నాయి.

వ్యవసాయంపై చర్చ
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు స్థితిగతులు, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ వంటి అంశాలపై సోమవారం నాటి కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్‌ 2022–23 రూపకల్పన, శాఖల వారీగా చేయాల్సిన కసరత్తు, శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపైనా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపైనా చర్చించే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, ధరణి పోర్టల్, పోడు భూములు, దళితబంధు అమలు వంటి అంశాలు సైతం చర్చకు రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement