• జిల్లా పాలనలో సహకరించేందుకు ప్రత్యేక ఏర్పాటు
• {పస్తుతమున్న 12 రిజిస్ట్రేషన్ జిల్లాలే కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో కొత్తగా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణతో ఏర్పాటవుతున్న రెవెన్యూ జిల్లాల కంటే రిజిస్ట్రేషన్ జిల్లాల సంఖ్య తక్కువగా ఉన్నందున... జిల్లా పాలనా యంత్రాంగానికి శాఖాపరంగా సహకరించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెవెన్యూ జిల్లాలతో పాటు రిజిస్ట్రేషన్ జిల్లాలను కూడా పెంచాలని ప్రభుత్వం తొలుత భావించినా.. దానివల్ల వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం, గ్రూప్-1 అధికారుల సంఘం, టీఎన్జీవోల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ జిల్లాల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది.
అయితే జిల్లాల పాలనా యంత్రాంగానికి (జిల్లా కలెక్టర్‌కు) సహకరించేందుకు సదరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్‌ను నోడల్ అధికారిగా నియమించనున్నారు. రెండేళ్లకోసారి భూముల మార్కెట్ విలువ సవరణ, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ నోడల్ అధికారే జిల్లా రిజిస్ట్రార్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్కెట్ విలువ సవరణ సమయంలో తహసీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లతో సమన్వయంగా వ్యవహరించేందుకు నోడల్ వ్యవస్థ తప్పనిసరని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జిల్లాలు 12గానే (హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్‌లతోపాటు ప్రస్తుతమున్న మిగతా 8 జిల్లాలు) ఉండనున్నాయి.
రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ జిల్లాలు
రిజిస్ట్రేషన్ జిల్లా ప్రతిపాదిత రెవెన్యూ జిల్లాలు
రంగారెడ్డి శంషాబాద్
రంగారెడ్డి ఈస్ట్ వికారాబాద్, మేడ్చల్
నల్లగొండ సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ
మెదక్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి, గద్వాల
వరంగల్ వరంగల్, వరంగల్ రూరల్,భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్
ఖమ్మం కొత్తగూడెం (భద్రాద్రి), ఖమ్మం
నిజామాబాద్ నిజామాబాద్, కామారెడ్డి
ఆదిలాబాద్ ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ (కొమురం భీం), నిర్మల్
కరీంనగర్ కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి
హైదరాబాద్ హైదరాబాద్ (పాక్షికం)
హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ (పాక్షికం)
రిజిస్ట్రేషన్ శాఖలో నోడల్ వ్యవస్థ
Published Mon, Oct 10 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement