అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.
ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.
ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment