New insurance
-
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్కమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాత ఒకేసారిగా లేదా ఏటా కొంత మొత్తం చొప్పున గ్యారంటీ ఇన్కమ్ అందుకునే విధంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఇది ఒక విధంగా పెన్షన్ ప్లాన్ కింద పని చేసేదే అయినా... 30 ఏళ్లు దాటిన వారికి కూడా ఏటా హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. పాలసీకి 8 లేదా 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వార్షిక ప్రీమియానికి గరిష్టంగా 10 రెట్లు బీమా రక్షణ లభిస్తుంది. ఈ పాలసీని 30 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 50 ఏళ్ల వారి వరకు తీసుకోవచ్చు. వచ్చే మూడు నెలల కాలంలో 10,000 అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్స్ను విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల ప్రీమియం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.