సాక్షి, అమరావతి: గత ఏడాది జనవరి.. జులై నుంచి ఇవ్వాల్సిన రెండు విడతల డీఏలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏడాది దాటినా వీటిని చెల్లించకుండా.. మరోవైపు, అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలను అస్మదీయులకు దోచిపెట్టడంపై వారు ప్రభుత్వ పెద్దల వైఖరిని బాహాటంగానే తూర్పారబడుతున్నారు. నిబంధనల మేరకు ఇవ్వాల్సిన డీఏలను ఇవ్వకుండా అడ్వాన్స్‌ల పేరుతో నిబంధనలను సడలించి మరీ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తూ ఆ తరువాత కేబినెట్‌లో ఆమోదింపజేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అదే తరహాలో తమకు కూడా డీఏను ఇచ్చేసి ఆ తరువాత కేబినెట్‌లో ఆమోదించుకోవచ్చు కదా అని వారు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగకు ఒక డీఏనైనా మంజూరు చేస్తారని ఎదురుచూశామని, కానీ, ప్రభుత్వం స్పందించలేదని సచివాలయంలో ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు.
అప్పుడూ ఇంతే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకు డీఏలను ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. అలాగే, పెన్షనర్లకు డీఏను ఏకంగా ఎగ్గొట్టారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వాటిని చెల్లించారని.. అంతేకాకుండా, పెన్షనర్లకు డీఏను పునరుద్ధరించారన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని, చంద్రబాబు ఇస్తే ఒక డీఏ మంజూరుచేస్తారని లేదంటే అదీ కూడా చేయరని, ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వమే ఇక మాకు దిక్కనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెలల తరబడి డీఏలను ఎప్పుడూ పెండింగ్ పెట్టలేదని, అంతేకాకుండా.. 2009 ఎన్నికల ముందు ఐఆర్ కూడా మంజూరు చేశారని వారు గుర్తుచేస్తున్నారు.
ఈవెంట్ల పేరుతో దుబారా
గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు 1.58 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, నెలకు కేవలం రూ.35 కోట్లే భారం పడుతుందని, కానీ.. ఈ కొద్దిపాటి మొత్తాన్ని కూడా మంజూరు చేయకుండా పెండింగ్‌లో పెట్టడంపై వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలాగే, గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగులకు 2.36 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, దీనికి కూడా నెలకు రూ.70 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. ఇంత చిన్నచిన్న మొత్తాలను ఉద్యోగులకు మంజూరు చేయకుండా ఓపక్క పెండింగ్ పెడుతూ మరోపక్క పెద్దఎత్తున ఈవెంట్ల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తోందని ఉద్యోగులు, పెన్షన్లు ఆరోపిస్తున్నారు. 11వ వేతన సవరణ కమిషన్‌ను సైతం ప్రభుత్వం ఆలస్యంగా నియమించిందని.. ఆ నివేదిక వచ్చేసరికి సమయం పడుతుందని, ఈలోగా మధ్యంతర భృతి ఇవ్వాలన్న తమ డిమాండ్‌పై కూడా ప్రభుత్వం నోరు మెదపడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీఏలే ఇవ్వని సర్కారు మధ్యంతర భృతి ఇస్తుందనే నమ్మకంలేదని, ఒకవేళ ఇచ్చినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇస్తుంది తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి ఉండదని వారంటున్నారు.
కేబినెట్‌లో ఇవ్వకపోతే నిరసన
పెండింగ్‌లోని రెండు డీఏల విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేయకుండా వారితో కుమ్మక్కవుతున్నారని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. మధ్యంతర భృతి కోసం కూడా ఆ నేతలు ఒత్తిడి తేవడంలేదన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేయకపోతే నిరసన కార్యక్రమాలను చేపడతామని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెండింగ్ డీఏలు ఎప్పుడు చెల్లిస్తారు?
Published Sat, Jan 19 2019 3:49 AM | Last Updated on Sat, Jan 19 2019 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment