చంద్రబాబు ప్రభుత్వంలో నెలనెలా తగ్గుదల
శనివారం 63,59,907 మందికే పింఛన్ల నిధులు విడుదల
గత ఏడాది మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేసింది 65,49,864 మందికి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య ఈ నెల కూడా తగ్గిపోయింది. గత నెల (జనవరి)లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్లకంటే శనివారం (ఫిబ్రవరి 1న) విడుదల చేసిన పింఛన్లు 18,036 తగ్గిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
ఇలా గత ఎనిమిది నెలల్లో ఏకంగా 1,89,957 పింఛన్లు తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత ఏడాది మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేయగా, శనివారం చంద్రబాబు ప్రభుత్వం 63,59,907 మంది లబ్దిదారులకే నిధులు విడుదల చేసింది. జనవరి నెల పింఛన్ల పంపిణీకి డిసెంబరు 31న 63,77,943 మందికే నిధులివ్వడం గమనార్హం.
భయం భయంగా లబ్ధిదారులు
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కొత్తగా ఎవరూ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకుండా ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. మరోపక్క.. గత ఐదేళ్లుగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి నెలా ఠంఛన్‌గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించేస్తోంది. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ఇప్పుడు అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్‌ల పేరుతో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన జరుపుతోంది. దీంతో తమ పింఛనుకు ఎప్పుడు ఎలా ఎసరు పెట్టేస్తారోనని లబ్ధిదారులు నిత్యం భయంభయంగా గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment