బదిలీల జాతర
Published Wed, Apr 26 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వ శాఖల్లో బదిలీల కసరత్తు మొదలైంది. మొత్తం ఉద్యోగుల్లో ఎంత శాతం మందిని బదిలీ చేయాలనే విషయంలో పరిమితి విధించకపోవడంతో ఈసారి ఎక్కువ మందికి స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో బదిలీలు 20 శాతానికి లోబడి ఉండాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం అలాంటి నిబంధనలు లేకపోవడంతో భారీ స్థాయిలో బదిలీలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే ప్రతిభ గలవారికి బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలనే అంశం పైరవీలకు ఆస్కారమిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తుంటే..
ఐదేళ్లపాటు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీ కావాలని కోరితే అవకాశవిుస్తారు. అయితే వారు కోరుకున్న చోట పోస్టు ఖాళీగా ఉండాలి. ఐటీడీఏ పరిధిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీ కోరుకుంటే తప్పనిసరిగా చేయాల్సి ఉంది. జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిపి మొత్తం 24 వేల మంది ఉన్నారు. వీరిలో 40 శాతం వరకూ (సుమారు 10వేల మంది) బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శాఖల వారీగా ఇలా..
కీలకమైన రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల నుంచి జూని యర్ అసిస్టెంట్ వరకూ సుమారు వెయ్యి మంది ఉద్యోగులున్నారు. వీరిలో 30 శాతం మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది. వీఆర్వోలు భారీస్థాయిలో కదిలే అవకాశం ఉంది. 50 శాతం మంది తహసీల్దార్లపై బదిలీ వేటు పడుతుందంటున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఆదేశాలు అనంతరమే జాబితా తయారు కానుంది. పంచాయతీరాజ్ బదిలీలకు సంబంధించి గతంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడేవి. ఈసారి ప్రత్యేక ఉత్తర్వులు వస్తాయా లేక అందరితోపాటు బదిలీ చేస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. విద్యాశాఖలో వెబ్ విధానం, పనితీరుకు సంబంధించి పాయింట్లు అమలు చేస్తామని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. వీరి బదిలీలకు శాఖాపరంగా ప్రత్యేక ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఈనెల 27న డీఈఓ, ఆర్‌జేడీలతో చర్చలు జరిపి.. అనంతరం బదిలీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ సుమారు 1,500 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో తక్కువ మందికే బదిలీలు అయ్యాయి. ఈసారి పరిమితి లేకపోవడంతో 50 శాతం మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డీఆర్‌డీఏ, డ్వామా ప్రాజెక్టులకు బదిలీల ఉత్తర్వులు వర్తించవు. పని ఆధారంగా ఎప్పటికప్పుడు చేసుకోవడంతో బదిలీలు వీరికి వర్తించవని పేర్కొంటున్నారు. ఈ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి సైతం స్థాన చలనం కలిగే అవకాశం లేదు.
నాయకులకూ వెసులుబాటు లేదు
బదిలీ విషయంలో ఈసారి ఉద్యోగుల సంఘాల నాయకులకు వెసులుబాటు లేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులకు రెండుసార్లు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తారని, రెండుసార్లు దాటితే బదిలీ తప్పదని స్పష్టం చేశారు. దీంతో ఎప్పటినుంచో ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగ సంఘ నేతలకూ ఈసారి స్థాన చలనం తప్పేలా లేదు.
జీఓ 245 అమలు చేయాల్సిందే
ఉద్యోగుల బదిలీల విషయంలో 2014 సెప్టెంబర్ 16వ తేదీన ఇచ్చిన 245 జీఓ ప్రకారం బదిలీల ప్రక్రియ కొనసాగాలి. ఉద్యోగ సంఘ నాయకులకు 9 సంవత్సరాలు వెసులుబాటు ఉండాల్సిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేయకుంటే ఉద్యోగులు ఆందోళన చేస్తాం.
– సీహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి, ఎ¯ŒSజీఓ జిల్లా శాఖ
పారదర్శకంగా చేయాలి
బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. నిబంధనల మేరకు బదిలీలు చేయాలి. జిల్లాలో ఏ ఉద్యోగికీ అన్యాయం జరగకూడదు. పారదర్శకత లోపిస్తే బాధిత ఉద్యోగులకు అండగా నిలబడతాం.
– కె.రమేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర రెవెన్యూ అసోసియేష¯ŒS
Advertisement
Advertisement