గురుకులంలో 317 చిక్కులు | Employees who do not move despite allotment as per GO 317 | Sakshi
Sakshi News home page

గురుకులంలో 317 చిక్కులు

Published Sat, Jan 27 2024 6:08 AM | Last Updated on Sat, Jan 27 2024 2:56 PM

Employees who do not move despite allotment as per GO 317 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు.  2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది.

కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు.

అన్నింటికీ అడ్డంకులే
సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి.  రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్‌ఈఐఎస్‌) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు.

మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది.

బదిలీలకు ఐదేళ్లు పూర్తి...
గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్‌ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి.

అతి త్వరలో మెరిట్‌ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement