new go
-
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
కోవిడ్ వైద్యం: కీలక జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కోవిడ్ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్ పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ఎంప్యానెల్ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఎంప్యానెల్ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలోనూ 50శాతం బెడ్లు కోవిడ్ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆస్పత్రుల్లో ఇంకా బెడ్లు మిగిలిఉంటే కోవిడ్ పేషంట్లకు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. ఆరోగ్యమిత్ర, నోడల్ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏ కోవిడ్ పేషంట్‌ను ఆస్పత్రిలో అడ్మిషన్ నిరాకరించరాదని ప్రభుత్వం పేర్కొంది. కచ్చితంగా డాక్టరు అడ్మిషన్ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆదేశించారు. చదవండి: కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చు: విజయరాఘవన్ -
బడాజోరు!
* క్రమబద్ధీకరణ జీవోపై పెద్దల కన్ను * మధ్యవర్తుల ప్రవేశం.. పేదలు బెంబేలు * కొత్త జీవోతో నిరుపేదల్లో ఆశలు * క్రమబద్ధీకరణకు భారీగా దరఖాస్తులు * పేదల ముసుగులో ‘రియల్’ బాబులు * రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు * ఖరీదైన స్థలాల పేరుతో దళారుల దగా నిరుపేదల భూముల క్రమబద్ధీకరణ జీవోను బడాబాబులు అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్నారు. కోట్ల విలువైన భూములను పేదల ముసుగులో తన్నుకుపోయే కుట్రలు సాగుతున్నాయి. ఈ దందాపై పట్టున్న రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమ పనిని సులువు చేసుకునేందుకు పూనుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంలో అన్యాక్రాంతానికి గురైన ఎన్నెస్పీ కాల్వ భూముల క్రమబద్ధీకరణకు దాఖలవుతున్న దరఖాస్తుల్లో బినామీలవే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై యంత్రాంగం దృష్టిసారిస్తే మరిన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో భూముల క్రమబద్ధీకరణ కొందరు అధికారులకు కాసుల పంట పండిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కోట్ల విలువచేసే భూములను పేదల ముసుగులో బడాబాబులకు అంటగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన క్రమబద్ధీకరణ జీవోను కొందరు పెద్దలు, మరికొందరు రియల్టర్లు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దందాపై అవగాహన ఉన్న కొందరు రెవెన్యూ అధికారులపై ప్రలోభాల వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పేదల కోసం జారీ అయిన జీవోతో పెద్దలు లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చిగురించిన ఆశలు ఖమ్మంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చెందిన సుమారు 200 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఖమ్మం అర్బన్ మండలంలోని మమత మెడికల్ కళాశాల రోడ్డులో వ్యవసాయ భూములకు సాగునీరు అందించే సాగర్‌కాల్వ ఆక్రమణకు గురైంది. గతంలో ఈ ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం కాల్వకు నీరు విడుదల చేసేవారు. క్రమేణ ఇక్కడ ఆవాసాలు ఏర్పడటంతో మొత్తం వ్యవసాయ భూములు రియలెస్టేట్ వెంచర్లుగా మారాయి. ఎన్నెస్పీ అధికారులు కూడా ఈ కాల్వకు సాగునీటి విడుదల నిలిపివేశారు. సుమారు ఏడు కిలోమీటర్ల మేరకు ఖాళీగా ఉన్న సాగర్కాల్వను క్రమంగా పూడ్చుకుంటూ పేదలు దానిపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని.. క్రమంగా వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది జిల్లా అధికారులు ఈ ఇళ్లను కూల్చివేశారు. సాగర్ కాల్వలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి వేరే చోట భూములు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా వారికి ప్రత్యామ్నాయం చూపించలేదు. కూల్చిన కట్టడాల మధ్యే గుడారాలు వేసుకుని పేదలు నివసిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన క్రమబద్ధీకరణ జీవో 58, 59లతో ఇక్కడి నిరుపేదల్లో ఆశలు చిగురించాయి. పెద్ద సంఖ్యలో రెవెన్యూ కార్యాలయాల వద్ద క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకుంటున్నారు. తహశీల్దార్ కార్యాలయం కిటకిట ఖమ్మం అర్బన్ మండల తహశీల్దార్ కార్యాలయం క్రమబద్ధీకరణ కోసం వచ్చే వారితో కిటకిటలాడుతోంది. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఇదే అదనుగా బడాబాబులు రంగంలోకి దిగారు. పేదల పేరుతో బినామీ దరఖాస్తులు చేసుకొని ఎన్నెస్పీ భూముల కైంకర్యానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్నెస్పీ కాల్వ ఉన్న ప్రాంతంలో గజం భూమి విలువ కనీసం రూ.12,500 ఉంది. ఇలాంటి భూములు పెద్ద సంఖ్యలో బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. వీటిని రూపాయి ఖర్చు లేకుండా క్రమబద్ధీకరించుకుంటే తర్వాత మార్కెట్లో దర్జాగా అమ్ముకోవచ్చునే ఆలోచనతో దరఖాస్తులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారులకు కూడా కొంత వాటా ముట్టజెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనిని నిర్వహించేందుకు దళారీలు కూడా రంగంలోకి దిగారు. ఒక్కో క్రమబద్ధీకరణకు పదిశాతం చొప్పున రెవెన్యూ మామూళ్లు ఇవ్వాలంటూ కొందరు దళారీలు ఇప్పటికే బేరసారాలకు దిగారు. నివాసాలను తొలగించడంతో ఇప్పటికే చాలా మంది పేదలు ఈ ప్రాంతాన్ని వదిలి వేరేచోటకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన వారి పేర్లను కూడా దళారీలు సేకరిస్తున్నారు. ఈ పేర్లతో కూడా దరఖాస్తులు దాఖలు అవుతున్నాయి. ఇందులో దళారీలు, బడాబాబులు, రెవెన్యూ అధికారులకు కూడా లాభం వస్తుండటంతో క్రమబద్ధీకరణ వీరికి పండుగలా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రజాసంఘాలు నుంచి మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పేదల కోసం జారీ చేసిన జీవో పెద్దల జేబు నింపుతోందనే ఆరోపణలు ప్రజాసంఘాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, దరఖాస్తు గడువును ప్రభుత్వం కొంత పెంచింది. 125 గజాల లోపు వారు ఈనెల 31 లోగాా, ఆ పైన ఉన్నవారు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.