బడాజోరు! | golmals in regularisation of lands? | Sakshi
Sakshi News home page

బడాజోరు!

Published Thu, Jan 22 2015 8:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

golmals in regularisation of lands?

    * క్రమబద్ధీకరణ జీవోపై పెద్దల కన్ను
    * మధ్యవర్తుల ప్రవేశం.. పేదలు బెంబేలు
     * కొత్త జీవోతో నిరుపేదల్లో ఆశలు
     * క్రమబద్ధీకరణకు భారీగా దరఖాస్తులు
     * పేదల ముసుగులో ‘రియల్’ బాబులు
     * రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు
     * ఖరీదైన స్థలాల పేరుతో దళారుల దగా
 నిరుపేదల భూముల క్రమబద్ధీకరణ జీవోను బడాబాబులు అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్నారు. కోట్ల విలువైన భూములను పేదల ముసుగులో తన్నుకుపోయే కుట్రలు సాగుతున్నాయి. ఈ దందాపై పట్టున్న రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమ పనిని సులువు చేసుకునేందుకు పూనుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంలో అన్యాక్రాంతానికి గురైన ఎన్నెస్పీ కాల్వ భూముల క్రమబద్ధీకరణకు దాఖలవుతున్న దరఖాస్తుల్లో బినామీలవే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై యంత్రాంగం దృష్టిసారిస్తే మరిన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  జిల్లాలో భూముల క్రమబద్ధీకరణ కొందరు అధికారులకు కాసుల పంట పండిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కోట్ల విలువచేసే భూములను పేదల ముసుగులో బడాబాబులకు అంటగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన క్రమబద్ధీకరణ జీవోను కొందరు పెద్దలు, మరికొందరు రియల్టర్లు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దందాపై అవగాహన ఉన్న కొందరు రెవెన్యూ అధికారులపై ప్రలోభాల వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పేదల కోసం జారీ అయిన జీవోతో పెద్దలు లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 చిగురించిన ఆశలు
 ఖమ్మంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చెందిన సుమారు 200 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఖమ్మం అర్బన్ మండలంలోని మమత మెడికల్  కళాశాల రోడ్డులో వ్యవసాయ భూములకు సాగునీరు అందించే సాగర్‌కాల్వ ఆక్రమణకు గురైంది. గతంలో ఈ ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం కాల్వకు నీరు విడుదల చేసేవారు. క్రమేణ ఇక్కడ ఆవాసాలు ఏర్పడటంతో మొత్తం వ్యవసాయ భూములు రియలెస్టేట్ వెంచర్లుగా మారాయి. ఎన్నెస్పీ అధికారులు కూడా ఈ కాల్వకు సాగునీటి విడుదల నిలిపివేశారు. సుమారు ఏడు కిలోమీటర్ల మేరకు ఖాళీగా ఉన్న సాగర్‌కాల్వను క్రమంగా పూడ్చుకుంటూ పేదలు దానిపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.


ఇరవై ఏళ్లుగా ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని.. క్రమంగా వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది జిల్లా అధికారులు ఈ ఇళ్లను కూల్చివేశారు. సాగర్ కాల్వలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి వేరే చోట భూములు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా వారికి ప్రత్యామ్నాయం చూపించలేదు. కూల్చిన కట్టడాల మధ్యే గుడారాలు వేసుకుని పేదలు నివసిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన క్రమబద్ధీకరణ జీవో 58, 59లతో ఇక్కడి నిరుపేదల్లో ఆశలు చిగురించాయి. పెద్ద సంఖ్యలో రెవెన్యూ కార్యాలయాల వద్ద క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకుంటున్నారు.

 తహశీల్దార్ కార్యాలయం కిటకిట
 ఖమ్మం అర్బన్ మండల తహశీల్దార్ కార్యాలయం క్రమబద్ధీకరణ కోసం వచ్చే వారితో కిటకిటలాడుతోంది. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఇదే అదనుగా బడాబాబులు రంగంలోకి దిగారు. పేదల పేరుతో బినామీ దరఖాస్తులు చేసుకొని ఎన్నెస్పీ భూముల కైంకర్యానికి సిద్ధమవుతున్నారు.
 ప్రస్తుతం ఎన్నెస్పీ కాల్వ ఉన్న ప్రాంతంలో గజం భూమి విలువ కనీసం రూ.12,500 ఉంది. ఇలాంటి భూములు పెద్ద సంఖ్యలో బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. వీటిని రూపాయి ఖర్చు లేకుండా క్రమబద్ధీకరించుకుంటే తర్వాత మార్కెట్లో దర్జాగా అమ్ముకోవచ్చునే ఆలోచనతో దరఖాస్తులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారులకు కూడా కొంత వాటా ముట్టజెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనిని నిర్వహించేందుకు దళారీలు కూడా రంగంలోకి దిగారు. ఒక్కో క్రమబద్ధీకరణకు పదిశాతం చొప్పున రెవెన్యూ మామూళ్లు ఇవ్వాలంటూ కొందరు దళారీలు ఇప్పటికే బేరసారాలకు దిగారు.

నివాసాలను తొలగించడంతో ఇప్పటికే చాలా మంది పేదలు ఈ ప్రాంతాన్ని వదిలి వేరేచోటకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన వారి పేర్లను కూడా దళారీలు సేకరిస్తున్నారు. ఈ పేర్లతో కూడా దరఖాస్తులు దాఖలు అవుతున్నాయి. ఇందులో దళారీలు, బడాబాబులు, రెవెన్యూ అధికారులకు కూడా లాభం వస్తుండటంతో క్రమబద్ధీకరణ వీరికి పండుగలా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రజాసంఘాలు నుంచి మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పేదల కోసం జారీ చేసిన జీవో పెద్దల జేబు నింపుతోందనే ఆరోపణలు ప్రజాసంఘాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, దరఖాస్తు గడువును ప్రభుత్వం కొంత పెంచింది. 125 గజాల లోపు వారు ఈనెల 31 లోగాా, ఆ పైన ఉన్నవారు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement