వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.
డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.
హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.
దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment