ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్‌ కట్‌.. ‍ప్రముఖ టెక్‌ కంపెనీ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ‍ప్రముఖ టెక్‌ కంపెనీ కీలక నిర్ణయం

Published Tue, Mar 19 2024 11:52 AM

Dell Said That Who Will Not Return To Office Those Will Not Be Promoted - Sakshi

ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్‌ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

టెక్‌ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్‌ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్‌పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్‌ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. 

తాజాగా డెల్‌ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్‌ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్‌ డెల్‌ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్‌ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి.

ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్‌ కొత్త నిబంధన..?

కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్‌, రిమోట్‌ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్‌ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్‌ రోల్‌లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని  కంపెనీ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement