
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.
గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..
భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్‌లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.