YouTube: మీకు మీరే బాస్‌ | YouTube is a another income stream by leveraging channel memberships | Sakshi
Sakshi News home page

YouTube: మీకు మీరే బాస్‌

Published Mon, Feb 26 2024 5:00 AM | Last Updated on Mon, Feb 26 2024 5:00 AM

YouTube is a another income stream by leveraging channel memberships - Sakshi

ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్‌ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్‌ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్‌ కంటెంట్‌ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..?  

ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్‌ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్‌ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్‌ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..?   

ఏమి కావాలి..?
ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్‌ చానల్‌ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్‌ టూల్‌ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్‌ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్‌ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్‌ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్‌ చేసి, ఎడిటింగ్‌ అనంతరం పబ్లిష్‌ చేయాలి.

ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్‌లోడ్‌ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్‌ రతీష్‌ (‘రతీష్‌ఆర్‌మీనన్‌’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్‌ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్‌ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్‌ అవసరం.  

ఆరంభం ఇలా..
► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్‌ ప్రారంభించి వీడియోల పోస్టింగ్‌ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్‌ ఐ యామ్‌ ఎలిజబుల్‌’ నోటిఫికేషన్‌ అలర్ట్‌ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్‌ నుంచి ఆహా్వనం వస్తుంది.  
► ఒక్కసారి మీ చానల్‌ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్‌ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా పని చేస్తుంది..?
యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్‌ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్‌ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌ (వైపీపీ) కింద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్‌ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ మాడ్యూల్‌ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్‌ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్‌నర్‌ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్‌ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్‌ ఇండియా డైరెక్టర్‌ ఇషాన్‌ జాన్‌ ఛటర్జీ వివరించారు.  

చానల్‌ సక్సెస్‌ కోసం..?
ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్‌/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్‌ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్‌ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్‌ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్‌ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి.

వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్‌్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్‌ పెరుగుతుంది. అనలైసిస్‌ టూల్‌ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్‌ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్‌ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది.

ఆదాయం ఏ రూపంలో..?
యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్‌ ఫండింగ్‌ ఫీచర్‌ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్‌  సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్‌ పంచుతుంది. సూపర్‌ చాట్, సూపర్‌ స్టికర్స్‌ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థి మన్‌దీప్‌ సింగ్‌ 2021లో ‘డేటాసైన్స్‌డైరీస్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ తెరిచాడు.

కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్‌ ఫండింగ్‌ ఫీచర్‌ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్‌ వెబ్‌ డిజైనర్‌ రతీష్‌ ఆర్‌ మీనన్‌ ‘రతీష్‌ఆర్‌మీనన్‌’ పేరుతో 2012 నుంచి చానల్‌ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది.

యూట్యూబ్‌ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్‌ ప్రకటనలు, అఫిలియేట్‌ మార్కెటింగ్‌ కమీషన్‌ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్‌ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్‌ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్‌ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్‌ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్‌ మార్కెటింగ్‌ అంటే.. చానల్‌ డిస్క్రిప్షన్‌ లింక్‌ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్‌ఎల్‌ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్‌లో ఉంచడం.

ఎవరైనా యూజర్‌ ఆ లింక్‌ను క్లిక్‌ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్‌ ఫండింగ్‌ ఫీచర్‌లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్‌ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్‌ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్‌షిప్‌ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్‌ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది.   

రెగ్యులర్‌ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..?
తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్‌ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్‌ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్‌ ప్రపంచంలో ప్యాసివ్‌ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు.

కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్‌ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్‌ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్‌ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్‌ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే.

అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది.   అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్‌ ట్రైనర్‌ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్‌ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్‌ అవర్స్‌ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్‌ అంటున్నారు. యూట్యూబ్‌ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్‌ ఛానల్‌ ఆరంభించి వీడియోలు పోస్ట్‌ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు.

రతీష్‌ఆర్‌మీనన్‌ 2011లో చానల్‌  ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్‌ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్‌ సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ దాటింది. టెక్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసే రతీష్‌, ట్రావెల్‌ వీడియోలను కూడా పోస్ట్‌ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్‌ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ అయి, ఒక మిలియన్‌ వ్యూస్‌ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట.  

ఏమిటి మార్గం..?
చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్‌ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు.

సక్సెస్‌ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్‌ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్‌ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్‌ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్‌ చానళ్లు తెరిచి యూట్యూబ్‌ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement