ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్‌ | Kinetic Group entered the EV battery market with a significant investment | Sakshi
Sakshi News home page

ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్‌

Published Sat, Feb 22 2025 1:19 PM | Last Updated on Sat, Feb 22 2025 1:31 PM

Kinetic Group entered the EV battery market with a significant investment

ఆటోమోటివ్‌ విడిభాగాల రంగంలో ఉన్న కైనెటిక్‌ గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ తయారీ రంగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రూ.50 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫెసిలిటీలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం 60,000 రేంజ్‌–ఎక్స్‌ బ్రాండ్‌ బ్యాటరీలను తయారు చేస్తారు. లిథియం–అయాన్‌ ఫాస్ఫేట్‌ (ఎల్‌ఎఫ్‌పీ), నికెల్‌ మాంగనీస్, కోబాల్ట్‌ (ఎన్‌ఎంసీ) రకం బ్యాటరీలు కూడా ఉత్పత్తి అవుతాయని కంపెనీ తెలిపింది.

వాహన తయారీ సంస్థలకు సైతం వీటిని సరఫరా చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. త్రీవీలర్స్‌ కోసం ప్రిస్మాటిక్‌ సెల్స్‌ అభివృద్ధి చేస్తున్నట్టు కైనెటిక్‌ గ్రూప్‌ వివరించింది. కైనెటిక్‌ గ్రూప్‌నకు చెందిన ప్రధాన సంస్థ అయిన కైనెటిక్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ ఐదు దశాబ్దాలకు పైగా ఆటోమోటివ్‌ రంగంలో నిమగ్నమైంది. అహ్మద్‌నగర్‌ తయారీ కేంద్రంలో కంపెనీ 32 తయారీ షెడ్స్‌లో సుమారు 1,000 మందిని నియమించింది. 400లపైచిలుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. రెనో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌ లేలాండ్‌ వంటి ప్రధాన ఆటోమోటివ్‌ తయారీ సంస్థలు కైనెటిక్‌ గ్రూప్‌ క్లయింట్లుగా ఉన్నాయి.  

ఇదీ చదవండి: రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు

రెలిగేర్‌ షేరుకి డాబర్‌ జోష్‌

బర్మన్‌ కుటుంబం చేతికి నియంత్రణ

సాధారణ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ తదుపరి బర్మన్‌ కుటుంబం ప్రమోటర్లుగా అవతరించడంతో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఓపెన్‌ ఆఫర్‌ తదుపరి రెలిగేర్‌లో దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా ప్రమోటర్ల వాటా  25.16 శాతానికి బలపడింది. అంతకుముందు 21.10 శాతం వాటా కలిగి ఉంది. వెరసి రెలిగేర్‌లో అతిపెద్ద వాటాదారుకావడంతోపాటు ప్రమోటర్‌గా నిలిచింది. రెలిగేర్‌ యాజమాన్యం, బోర్డుతో కలసి పనిచేస్తామని, వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తామని బర్మన్‌ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement