ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..
అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.
అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment