in offices
-
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
స్తంభించిన పాలన
అటు పుష్కరాలు... ఇటు సాధికార సర్వేలు ఇటు పుష్కరాలు, అటు సాధికారిత సర్వే సిబ్బంది లేక వెలవెలబోతున్న మున్సిపల్ కార్యాలయాలు అమలాపురం టౌన్: జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది వేరే విధుల్లో ఉండటంతో కార్యాలయాలు వెల బోతున్నాయి. వివిధ పనుల కోసం మున్సిపల్ కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ క్షేత్ర సిబ్బంది ప్రజా సాధికారిత సర్వేల్లో నిమగ్నమై ఉండగా కొందరు అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది కృష్ణా పుష్కరాల విధులకు వెళ్లారు. జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయితీల నుంచి దాదాపు 200 మంది అధికారులు, సిబ్బందిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కర విధులకు పంపించారు. ఆయా మున్సిపాలిటీల్లోని పది నుంచి పదిహేను మంది సిబ్బంది సాధికార సర్వేలో నిమగ్నమయ్యారు. దాంతో మున్సిపల్ కార్యాలయాల్లో ఐదు నుంచి పది మంది వరకూ అధికారులు, ఉద్యోగులు మాత్రమే మిగిలారు. మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక, పారిశుధ్య విభాగాల అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలను కూడా పుష్కర విధులకు తరలించారు. అమలాపురం మున్సిపాలిటీలో ఒకే ఒక్క అధికారి (రెవెన్యూ) మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయనే అన్ని శాఖలకూ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో డీఈఈ మాత్రమే ఉన్నారు. మిగిలిన విభాగాల్లో ఒకరిద్దరు ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల పరిస్థితి ఇలానే ఉంది. పనులమీద కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు కార్యాలయయం మెట్ల వద్దే ఉన్న కొద్దిపాటి దిగువ సిబ్బంది పుష్కరాలు అయ్యాక రండి అని చెప్పి పంపించేస్తున్నారు. నిలిచిన పన్నుల వసూళ్లు సాధికారిత సర్వే పనుల్లో, పుష్కరాల పనుల్లో మున్సిపల్ సిబ్బంది తలమునకలై ఉండడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా పన్నుల వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీనే తీసుకుంటే పది రోజుల్లో దాదాపు రూ.10 లక్షలకు పైగా పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. జిల్లాలో నగర, పుర పాలికల్లో దాదాపు రూ. 1.50 కోట్ల నుంచి రూ. రెండు కోట్ల వరకూ పన్నుల వసూళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సాధికారిత సర్వేలో నిమగ్నమైన సిబ్బందిని పరిగణనలోకి తీసుకొని కొద్దిమందిని మాత్రమే కృష్ణా, గుంటూరు జిల్లాలకు పంపించి ఉంటే ఇంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేవి కావని ఓ మున్సిపల్ అధికారి ‘సాక్షి’ వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు.