స్తంభించిన పాలన | stopthem activities | Sakshi
Sakshi News home page

స్తంభించిన పాలన

Published Fri, Aug 19 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

స్తంభించిన పాలన

స్తంభించిన పాలన

  • అటు పుష్కరాలు... ఇటు సాధికార సర్వేలు
  • ఇటు పుష్కరాలు, అటు సాధికారిత సర్వే
  • సిబ్బంది లేక వెలవెలబోతున్న మున్సిపల్‌ కార్యాలయాలు
  • అమలాపురం టౌన్‌:
    జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయాల సిబ్బంది వేరే విధుల్లో ఉండటంతో కార్యాలయాలు వెల బోతున్నాయి. వివిధ పనుల కోసం మున్సిపల్‌ కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్‌ క్షేత్ర సిబ్బంది ప్రజా సాధికారిత సర్వేల్లో నిమగ్నమై ఉండగా కొందరు అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది కృష్ణా పుష్కరాల విధులకు వెళ్లారు. జిల్లాలోని రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయితీల నుంచి దాదాపు 200 మంది అధికారులు, సిబ్బందిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కర విధులకు పంపించారు. ఆయా మున్సిపాలిటీల్లోని పది నుంచి పదిహేను మంది సిబ్బంది సాధికార సర్వేలో నిమగ్నమయ్యారు. దాంతో మున్సిపల్‌ కార్యాలయాల్లో ఐదు నుంచి పది మంది వరకూ అధికారులు, ఉద్యోగులు మాత్రమే మిగిలారు. మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక, పారిశుధ్య విభాగాల అధికారులు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలను కూడా పుష్కర విధులకు తరలించారు. అమలాపురం మున్సిపాలిటీలో ఒకే ఒక్క అధికారి (రెవెన్యూ) మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయనే అన్ని శాఖలకూ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో డీఈఈ మాత్రమే ఉన్నారు. మిగిలిన విభాగాల్లో ఒకరిద్దరు ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల పరిస్థితి ఇలానే ఉంది. పనులమీద కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు కార్యాలయయం మెట్ల వద్దే ఉన్న కొద్దిపాటి దిగువ సిబ్బంది పుష్కరాలు అయ్యాక రండి అని చెప్పి పంపించేస్తున్నారు.  
     
    నిలిచిన పన్నుల వసూళ్లు
    సాధికారిత సర్వే పనుల్లో, పుష్కరాల పనుల్లో మున్సిపల్‌ సిబ్బంది తలమునకలై ఉండడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా పన్నుల వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీనే తీసుకుంటే పది రోజుల్లో దాదాపు రూ.10 లక్షలకు పైగా పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. జిల్లాలో నగర, పుర పాలికల్లో దాదాపు రూ. 1.50 కోట్ల నుంచి రూ. రెండు  కోట్ల వరకూ పన్నుల వసూళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సాధికారిత సర్వేలో నిమగ్నమైన సిబ్బందిని పరిగణనలోకి తీసుకొని కొద్దిమందిని మాత్రమే కృష్ణా, గుంటూరు జిల్లాలకు పంపించి ఉంటే ఇంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేవి కావని ఓ మున్సిపల్‌ అధికారి ‘సాక్షి’ వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement