ఎంత భద్రం! | airport protection less | Sakshi
Sakshi News home page

ఎంత భద్రం!

Published Sun, Jul 24 2016 9:30 PM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

ఎంత భద్రం! - Sakshi

ఎంత భద్రం!

రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రక్షణ కరువు!
ఎస్పీఎఫ్‌ నిర్వహణలో ఎయిర్‌పోర్ట్‌
అరకొరగా సిబ్బంది కేటాయింపు
ఉభయ గోదావరి జిల్లాలకు సేవలందిస్తున్న రాజమహేంద్రవరం విమానాశ్రయం భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం 730 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ విమానాశ్రయానికి భద్రత మరింత పటిష్టం చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం, జల వనరులను దృష్టిలో పెట్టుకుని భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.
– మధురపూడి
 
గతంలో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌)  ఆధీనంలోకి వెళ్లింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఒకొక్కరు 12 గంటలకు పైగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు వాటిల్లే పరిస్థితులు లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో భద్రత పరంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడం, యాప్రాన్‌ అభివృద్ధి చేయకపోవడం, విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి సేకరించిన భూములకు రక్షణ గోడ లేకపోవడం వంటివి భద్రత సిబ్బందికి సవాలుగా పరిణమించాయి.
 
విమానాశ్రయం విశేషాలివే..
  •  సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
  •  పది ముఖద్వారాలు, చుట్టూ రక్షణ గోడలు
  • విస్తారమైన రన్‌ వే, టెర్మినల్‌ భవనం, ఏటీసీ తదితర భవన సముదాయాలు
  • అదనపు విమానాలు, బోయింగ్‌ సర్వీసులు, నైట్‌ ల్యాండింగ్‌ కోసం అదనంగా 857 ఎకరాల సేకరణ
  • వీటిలో మధురపూడికి చెందిన 70 శాతం, బూరుగుపూడి, గుమ్ములూరుకు చెందిన 30 శాతం భూములున్నాయి.
  • ఈ భూములకు రక్షణ గోడ నిర్మించలేదు
  • ఉదయం 7.40 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఆరు విమాన సర్వీసులు ప్రయాణిస్తున్నాయి.
  • నిత్యం 730 మంది ప్రయాణికులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. 
ఎస్పీఎఫ్‌ ఆధీనంలోకి..
ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా ఇటీవల రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) స్వాధీన ం చేసుకుంది. ఇక్కడ ఎస్పీఎఫ్‌ సిబ్బంది 65 మంది, సెక్యూరిటీ, ఏఆర్‌ పోలీసులు 55 మంది ఉన్నారు. విమానాశ్రయం భద్రతకు ఈ మేరకు భద్రత బలగాలు చాలడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై పనిభారం పెరిగింది. ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ మధురపూడి, బూరుగుపూడి, ఉండేశ్వరపురం, గుమ్ములూరు. తొర్రేడు, మిర్తిపాడు, గాడాల, దోసకాయలపల్లి, మునగాల, కాపవరం, కోరుకొండ గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో దట్టమైన తోటలున్నాయి. వీటికితోడు జల వనరులు కూడా సంఘ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా మారవచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయా ప్రాంతాల్లో భద్రత సిబ్బంది నిఘా, గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది.
 
నైట్‌ ల్యాండింగ్‌
రాత్రివేళల్లో విమానాల రాకపోకలు(నైట్‌ ల్యాండింగ్‌) రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అమలు కావడం లేదు. ఇందుకు కొన్ని సాంకేతిక సమస్యలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని ముఖద్వారాలను పటిష్టపరచాలి. యాప్రాన్‌పై ఉన్న బొరియల నుంచి వస్తున్న నక్కలను అరికట్టాలి. గత ఏడాది పుష్కరాలకు ఈ సమస్య పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ, కార్యరూపం దాల్చలేదు. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే నుంచి వర్షపు నీరు పారడానికి ఈ రంధ్రాలను ఏర్పాటు చేశారు.
 
పెరగనున్న సిబ్బంది సంఖ్య
విమానాశ్రయం రక్షణ కోసం భద్రత సిబ్బంది సంఖ్య పెరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీఎఫ్‌ సిబ్బందిని పెంచుతాం. అలాగే విమానాశ్రయ విస్తరణ చర్యల్లో భాగంగా భద్రతపరమైన చర్యలు తీసుకుంటాం. అంత్య పుష్కరాల నాటికి నైట్‌ ల్యాండింగ్‌ పూర్తికాకపోయినా, త్వరలో బోయింగ్, జెట్‌ సర్వీసుల సేవలు అందుబాటులోకి వస్తాయి.
– ఎం.రాజ్‌కిషోర్, ఎయిర్‌ పోర్ట్‌  డైరెక్టర్, రాజమహేంద్రవరం విమానాశ్రయం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement