టెక్ పరిశ్రమలో 2024లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే, ఆల్ఫాబెట్, అమెజాన్, సిటీ గ్రూప్, ఈబే, మాకీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.
తాజగా యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 12,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి ఐదు రోజులు కార్మికులను ఆఫీసులకు రప్పించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలను పంపుతున్న క్రమంలో లేఆఫ్ ప్రకటనలు వస్తున్నాయి. ఒకవైపు యూఎస్ ఉద్యోగ అవకాశాలు కాస్త పెరిగాయి. మరోవైపు హై ప్రొఫైల్ ఉద్యోగాల కోతల జాబితా పెరుగుతున్న వైట్ కాలర్ ప్రపంచానికి అనిశ్చితిని జోడిస్తోంది. రిమోట్ వర్క్‌పై పెరుగుతున్న అణచివేత కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్ ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుంకు వ్యూహాలను పొందడానికి దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, రిక్రూటర్‌లు, కన్సల్టెంట్‌లు, కెరీర్ కోచ్‌లను బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. వారు ఏం చెప్పారు.. కోతల ప్రమాదం ఎక్కువ ఉన్నది ఎలాంటి ఉద్యోగులకు అన్నది ఇక్కడ చూద్దాం..
మిడిల్ మేనేజర్లు, రిమోట్ వర్కర్లు జాగ్రత్త
కంపెనీలు తొలగింపులకు తరచుగా మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ‘గ్లాస్‌డోర్’ ప్రధాన ఆర్థికవేత్త డేనియల్ జావో చెప్పారు. ఇలాంటి సమయంలో మిడిల్ మేజేజర్లు బాధితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో ప్రస్తుత తొలగింపుల రౌండ్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్న తరుణంలో లేఆఫ్‌లలో రిమోట్‌గా పనిచేస్తున్నవారినే లక్ష్యంగా చేసుకుంటారని కొన్ని నివేదికలు సూచించాయి. రిమోట్‌గా పనిచేస్తున్నవారిని తొలగించడం కంపెనీలకు సులువవుతుందని న్యూయార్క్‌లోని ఏబీఎస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏరియల్ షుర్ అభిప్రాయపడ్డారు.
కన్సల్టింగ్ సంస్థ గార్ట్‌నర్‌లో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ పెన్ మాట్లాడుతూ ఎవరిని తొలగించాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యుత్తమ సంస్థలు రెండు అంశాలను చూస్తాయని చెప్పారు. ఒకటి ఆ ఉద్యోగి వల్ల సంస్థకు ప్రస్తుతమైనా లాభదాయకంగా ఉండాలి లేదా భవిష్యత్తులో అయినా లాభం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అలాంటి ఉద్యోగులు ఇంటికిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment