Welfare Gurukuls
-
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
స్పేస్ చాలెంజ్‌లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ వివరాలను ఎస్సీ గురుకులాల కార్యదర్శి కె.హర్షవర్థన్ గురువారం మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఏటీఎల్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు 2,500 ఆవిష్కరణలను ప్రదర్శించారని చెప్పారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ గురుకుల విద్యార్థులు రూపొందించన ఆవిష్కరణ వాటిలో 75 ఉత్తమ ఆవిష్కరణలను బుధవారం ప్రకటించారని వెల్లడించారు. ఇందులో ఏపీకి సంబంధించి మూడు ఆవిష్కరణలకు మంచి పేరొచ్చిందని తెలిపారు. ఆ మూడు ఆవిష్కరణలు కూడా ఎస్సీ గురుకులాల విద్యార్థులవే కావడం గమనార్హమన్నారు. వీరికి త్వరలోనే ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు వస్తాయని తెలిపారు. -
మైనార్టీ సంక్షేమానికి తగ్గిన నిధులు
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. 2020– 21 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ. 1,138.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019–20 సంవత్సరంలో రూ. 1,346.95 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో రూ. 208 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. గత కేటాయింపులు భారీగా జరపడంతో పెండింగ్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. దీంతో 2020–21 వార్షిక సంవత్సరంలో ప్రాధాన్యతలకు తగినట్లు నిధులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. కార్మిక సంక్షేమానికి రూ.107.78 కోట్లు కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.107.78 కోట్లు కేటాయించిం ది. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ. 60. 35 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో అదనంగా రూ.47 కోట్లు కేటాయించడం గమనార్హం. మహిళా, శిశు సంక్షేమానికి కాస్త మెరుగ్గా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి నిధుల కేటాయింపులు కాస్త మెరుగుపడ్డాయి. గత బడ్జెట్లో ప్రగతి పద్దు కింద మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.663.80 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక బడ్జెట్లో రూ.676.11 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 13 కోట్లు అధికంగా కేటాయించారు. సంక్షేమ గురుకులాలకు రూ.2,073.91 కోట్లు సంక్షేమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.2,073.91 కోట్లు కేటాయించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.878.15 కోట్లు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.739.61 కోట్లు, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి రూ.212.98 కోట్లు, మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) రూ.243.17 కోట్లు కేటాయించింది. -
గురుకులాలు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో సంక్షేమ గురుకులాలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే (బీసీ) గురుకులాలు 96 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పాయి. ఇది రాష్ట్ర ఉత్తీర్ణత శాతం (86%) కంటె పది శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 90 శాతం, ఎస్టీ గురుకుల పాఠశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బీసీ గురుకులాల్లో మొత్తం 1307 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1248 మంది ఉత్తీర్ణులయ్యారు. 708 మంది ఏ గ్రేడ్, 530 మంది బీ గ్రేడ్ సాధించారు. నాగార్జునసాగర్, నాగర్‌కర్నూలు, చిట్యాల, ధర్మారం, మహేశ్వరం, కౌడిపల్లి, శాయంపేట స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్సీ గురుకులాల నుంచి 8,914 మంది విద్యార్థులు హాజరు కాగా 8,022 మంది పాసయ్యారు. ఈ గురుకులాల్లో 29 స్కూళ్లు వంద శాతం, 14 స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్టీ గురుకుల స్కూళ్ల నుంచి 2,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,988 మంది పాసయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయా గురుకులాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను మంత్రులు జోగురామన్న, జి.జగదీశ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్ అభినందించారు.