సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. 2020– 21 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ. 1,138.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019–20 సంవత్సరంలో రూ. 1,346.95 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్‌లో రూ. 208 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. గత కేటాయింపులు భారీగా జరపడంతో పెండింగ్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. దీంతో 2020–21 వార్షిక సంవత్సరంలో ప్రాధాన్యతలకు తగినట్లు నిధులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు.
కార్మిక సంక్షేమానికి రూ.107.78 కోట్లు
కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.107.78 కోట్లు కేటాయించిం ది. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 60. 35 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్‌లో అదనంగా రూ.47 కోట్లు కేటాయించడం గమనార్హం.
మహిళా, శిశు సంక్షేమానికి కాస్త మెరుగ్గా
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి నిధుల కేటాయింపులు కాస్త మెరుగుపడ్డాయి. గత బడ్జెట్లో ప్రగతి పద్దు కింద మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.663.80 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక బడ్జెట్లో రూ.676.11 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 13 కోట్లు అధికంగా కేటాయించారు.
సంక్షేమ గురుకులాలకు రూ.2,073.91 కోట్లు
సంక్షేమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.2,073.91 కోట్లు కేటాయించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) రూ.878.15 కోట్లు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) రూ.739.61 కోట్లు, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి రూ.212.98 కోట్లు, మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) రూ.243.17 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment