మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండల పరిషత్‌ను తిరిగి దక్కించుకుని కాంగ్రెస్ పట్టునిలుపుకుంటుందా...? కాస్త దూరంలో ఉన్న అవకాశాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన రాజకీయ చతురత ప్రదర్శించి దక్కించుకుంటారా అనే విషయం మండల వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
మండల పరిధిలో 22మంది ఎంపీటీసీలు ఉండగా అందులో 12మంది మద్దతు ఉన్నవారు ఎంపీపీగా ఎన్నికవుతారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు 10, టీడీపీకి బీజేపీతో కలసి 8మంది సభ్యుల బలం ఉంది. పుప్పాలగూడలో గెలిచిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో కాంగ్రెస్ ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యే సూచనలే అధికం. కానీ ఇక్కడే ఓ చిన్న తిరకాసు.. కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలుపొందిన నార్సింగ్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సందేహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుడి భార్యపైనే రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ నేత జ్ఞానేశ్వర్ పోటీలోకి దించారని వారు ఆరోపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎంపీపీ ఎంపికలో కాంగ్రెస్‌కు తామెందుకు మద్దతు ఇవ్వాలనే వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. స్వతంత్రులు ఇద్దరు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆ ఇద్దరు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ బలం తిరిగి 10లోనే ఉండిపోతుంది. ఇక టీడీపీవారు ఇదే అదనుగా వారిద్దరిని తమవైపు తిప్పుకుంటే కనుక వారి బలం అపుడు 10కే చేరే అవకాశం ఉంటుంది.
దీంతో అపుడు తిరిగి మండలంలో మిగిలిన హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్‌లలో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. వారిద్దరినీ తమవైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే అడిగినంతా ఇచ్చుకునైనా వారి మద్దతు కూడగట్టుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయత్నాలను ముమ్మురం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీడీపీలో రాని క్లారిటీ
మండల వ్యాప్తంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బలాబలాలు అలా ఉండగా మరోవైపు టీడీపీలో ఎంపీపీ స్థానం ఏ వ్యక్తి కట్టబెట్టాలనే విషయంలో తర్జన భర్జన కొనసాగుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు ఖానాపూర్‌కు చెందిన మల్లేశ్‌ముదిరాజ్‌కు ఎంపీపీ స్థానమంటూ ప్రచారం చేయడంతో పాటు అతడి చేత ఎన్నికలలో ఖర్చుపెట్టించి తీరా ఇపుడు బండ్లగూడకు చెందిన ప్రేమ్‌కుమార్‌గౌడ్‌ను తెరపైకి తెచ్చినట్టు ఆపార్టీ నాయకులే వాపోతున్నారు.
ఇంకోవైపు ఎంపీపీ స్థానం జనరల్‌కు ఉందని, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా కృషి చేశానని, పార్టీలో సీనియర్‌నని, తనకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎలాగైనా ఎంపీపీ స్థానాన్ని సాధిస్తానని మణికొండకు చెందిన కె.రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులను కోరినట్టు సమాచారం. అవసరమైతే రెండున్నరేళ్లు తాను, మరో రెండున్నరేళ్లు పార్టీ లో మరెవరైనా ఎంపీపీగా కొనసాగవచ్చని, ఇది తనకు సమ్మతమేనని పేర్కొన్నట్టు తెలిసింది.
ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యేనా?
Published Thu, May 15 2014 12:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement