‘అష్ట’కష్టాలు! | Another BRS MLA Joins Congress In Telangana | Sakshi
Sakshi News home page

‘అష్ట’కష్టాలు!

Published Sat, Jul 13 2024 4:37 AM | Last Updated on Sat, Jul 13 2024 4:39 AM

Another BRS MLA Joins Congress In Telangana

త్వరలో మరో ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి? 

లేదంటూనే హస్తం గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలు 

గులాబీ పెద్దలు కట్టడి చేస్తున్నా ఆగని వలసలు 

త్వరలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్న దానం 

ఇప్పటికే 8 మంది అధికారికంగా కాంగ్రెస్‌లోకి.. 

మూడింట రెండొంతుల ‘లెక్క’ అయ్యేదాకా ఫిరాయింపులు... పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు 

ఇప్పటికే ఓసారి భేటీ.. మరోమారు వ్యక్తిగతంగా కలిసే యోచన... న్యాయ పోరాటం,  క్షేత్రస్థాయిలో కేడర్‌ వద్దకు వెళ్లాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పారీ్టలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్‌ శిబిరం ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్ట పడటం లేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

గతంలో చేసిన పనుల బిల్లుల కోసం, వ్యాపారాలపై దాడులు, కేసుల బెదిరింపులతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనికితోడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వలసల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వరుసగా వలసల బాట! 
గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున 39 మంది  ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరారు. తాజాగా రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్‌ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

శాసనసభాపక్షం విలీనంపై చర్చ 
నిబంధనల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ సంఖ్యాబలంలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం అందులో విలీనమైనట్టు పరిగణిస్తారు. 2014–18 మధ్యలో టీడీపీ శాసనసభాపక్షం, 2018–23 మధ్యలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఇదే తరహాలో బీఆర్‌ఎస్‌లో విలీనమయ్యాయి. ఈ నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ నుంచి కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే.. శాసనసభాపక్షం విలీనమైనట్టుగా పరిగణిస్తారు.

ఇప్పటికే 9 మంది కాంగ్రెస్‌లో చేరడం, మరొకరు చేరికకు సిద్ధమైన నేపథ్యంలో.. ఇంకో 16 మంది బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించాల్సి ఉంటుంది. అయితే బీఆర్‌ఎస్‌కు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల నుంచే ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. 

కట్టడి కోసం బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు 
బీఆర్‌ఎస్‌ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో.. మిగతా వారిని కట్టడి చేసేందుకు గులాబీ పారీ్టలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కారులో అధికారం అనుభవించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు కేసీఆర్‌కు సన్నిహితుడైన ఎం.సంజయ్‌ వంటి నేతలు కూడా వీడటంపై చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి.. పక్షం రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

వారికి విందు ఇచ్చి.. పారీ్టలో కొనసాగితే కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తుపై భరోసా కలి్పంచే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే తన కారు మరమ్మతుకు అయ్యే ఖర్చులను తీసుకుని కూడా పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరింత మంది బీఆర్‌ఎస్‌ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ మరోమారు వ్యక్తిగతంగా భేటీకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ప్రలోభాలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ..!! 
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కేసీఆర్‌కు ఏకరువు పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దాడులు, కేసులు పెడతామనే బెదిరింపులు వంటి కారణాలతో పార్టీ మారక తప్పడం లేదని అంటున్నారని పేర్కొంటున్నాయి. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు గుర్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. 

న్యాయ పోరాటం.. ప్రజల మధ్యకు.. 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం డిమాండ్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ వేదికగా కొట్లాడాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్‌లను కలసి అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్‌ వైఖరిని వివరించాలని..  అనర్హత వేటుపై స్పందించాల్సిందిగా కోరాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎదుట పార్టీ ఎమ్మెల్యేలతో పరేడ్‌ చేయించేందుకూ సన్నద్ధమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్‌ స్వయంగా పర్యటించి.. ఆ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ తీరును ఎండగట్టాలనే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement