స్థానిక సంస్థల సారథుల ఎంపిక... | elections notification released for chairman positions | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల సారథుల ఎంపిక...

Published Thu, Jun 26 2014 11:31 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

స్థానిక సంస్థల సారథుల ఎంపిక... - Sakshi

స్థానిక సంస్థల సారథుల ఎంపిక...

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహుర్తం ఖరారైంది. నగర పంచాయతీలు/మున్సిపాలిటీలు, మండల, జిల్లా ప్రాదేశిక సంస్థలకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 3న నగర పంచాయతీ/మున్సిపాలిటీలు, 4న మండల పరిషత్, 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. అదే రోజు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కూడా ఉంటుందని పేర్కొంది. ఇదిలావుండగా, సార థుల సమరానికి తెరలేవడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.
 
అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు సరిపడా సంఖ్యాబలాన్ని
సమకూర్చుకునేందుకు చైర్మన్ అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెట్టారు. ఆర్థిక భారం తడిసిమోపెడు కావడంతో క్యాంపులను ఎత్తేసిన ఆశావ హులు.. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరోసారి యాత్రలకు పయనమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోవడంతో పలు చోట్ల ఫలితాలు కూడా తారుమారయ్యే పరిస్థితి తలెత్తింది.
 
విప్ ఉల్లంఘిస్తే పార్టీ ధిక్కరణ కింద అనర్హత వేటు పడుతుందని తెలిసినప్పటికీ, చాలా మంది వేరే పార్టీ కండువా కప్పుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అధికారపార్టీ అండదండలుంటే విప్ ఉల్లంఘిం చినా ఏమీ కాదనే ధీమాతో ఉన్నారు.
 
‘గోపి’లతో తంటా!
పురపోరులో వికారాబాద్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన అధిక్యత లభించింది. అయితే, మారిన రాజకీయ సమీకరణలు ఆ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నాయి. అనూహ్యంగా టీడీపీ, టీఆర్‌ఎస్‌లు జతకట్టాలని నిర్ణయించుకోగా, కాంగ్రెస్ నుంచి నలుగురు కౌన్సిలర్లు గోడదూకాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ రాజకీయ రసవత్తరంగా మారింది. అలాగే తాండూరులో మజ్లిస్, టీఆర్‌ఎస్ మధ్య పరస్పర అంగీకారం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇరుపార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీల్లో టీడీపీ- బీజేపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇందులో పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పగ్గాలను మహిళకు అప్పగించాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలు స్తోంది. బడంగ్‌పేట నగర పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది.
 
రోజుకో మలుపు!

ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో జెడ్పీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 33 జిల్లా ప్రాదేశిక స్థానాల్లో కాంగ్రెస్ 14, టీఆర్‌ఎస్ 12, టీడీపీకి 7 జెడ్పీటీసీలు దక్కాయి. జిల్లా పరిషత్ పీఠానికి అవసరమైన 17 మంది సభ్యులను కూడగట్టడానికి కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్‌లు పోటాపోటీగా క్యాంపులు నిర్వహించాయి.

టీఆర్‌ఎస్ ఇప్పటికీ శిబిరాలను నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం క్యాంపుకు రాంరాం పలికింది. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి తన సతీమణి సునీతను (యాలాల జెడ్పీటీసీ)మరోసారి ైచైర్‌పర్సన్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారానికి వెరవకుండా క్యాంపును నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలకు కూడా గాలం వేశారు. దీంట్లో కొంత మేర విజయం సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో అస్పష్టత నెలకొంది. ఖర్చుకు భయపడి యాదవరెడ్డి క్యాంపు ఎత్తివేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.
 
ఇంకోవైపు ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. యాదవరెడ్డి స్థానే కందుకూరు జెడ్పీటీసీ ఎనుగు జంగారెడ్డి పేరును పరిశీలిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తమ పార్టీ సభ్యులతో శంషాబాద్‌లో కాంగ్రెస్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ సమావేశం అనంతరం క్యాంపులకు బయలుదేరే అవకాశముందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
 
యాదవరెడ్డి అభ్యర్థిత్వంపై అనుమానాలున్నందున జంగారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలావుండగా, కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్‌లలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్‌ను నిలువరించేందుకు కాంగ్రెస్‌కు బహిరంగ మద్దతు ప్రకటిస్తూనే.. లోపాయికారిగా టీఆర్‌ఎస్ తో జతకట్టేందుకు సంకేతాలు పంపింది. కాంగ్రెస్ లో అనైక్యతను సాకుగా చూపి.. టీఆర్‌ఎస్ పంచన చేరడానికి సన్నాహాలు చేసుకుంటోంది. వైస్ చైర్మన్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ.. అవసరానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంది.
 
విలక్షణ తీర్పు
మండల, జిల్లా ప్రాదేశిక పోరులో ఈసారి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. అనూహ్యంగా టీఆర్‌ఎస్ పుంజుకోవడంతో కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అడ్రస్ గల్లంతైంది. ముఖ్యంగా పశ్చిమ రంగారెడ్డిలో గులాబీ జోరుకు టీడీపీ మట్టికరిచింది. శివారు మండలాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారిపోవడంతో చాలా మండలాల్లో త్రిశంకు ఫలితాలు వెలువడ్డాయి. దీంతో చైర్మన్ పగ్గాలపై కన్నేసిన ఆశావహులు.. ఎంపీటీసీలను శిబిరాలకు తరలించారు. విహారయాత్రలకు తీసుకెళ్లడమేకాకుండా.. ప్యాకేజీలు, నజరానాలను ప్రకటించారు.
 
 వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడుతుందని భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరడంలో జరిగిన ఆలస్యం ఈ ఎన్నికల జాప్యానికి దారితీసింది. దీంతో క్యాంపులకు తీసుకెళ్లిన నేతల జేబులు ఖాళీ అయ్యాయి. ఎంపీటీసీ సభ్యుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని భావించిన చైర్మన్ అభ్యర్థులు ఇంటి ముఖం పట్టారు.  కాగా, ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో పలు మండలాల్లో బలాబ లాల్లో తేడా వచ్చింది. కొన్ని చోట్ల ఫిరాయింపు రాజకీయాలకు తెరలేచింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రత్యర్థుల శిబిరాల్లో చేరిపోయారు.
 
మండల పరిషత్‌లో ఆయా పార్టీల బలాబలాలు!
హంగ్: మంచాల, మొయినాబాద్, కుల్కచర్ల, పూడూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, షాబాద్, చేవెళ్ల, కందుకూరు, ఘట్‌కేసర్, కీసర, మోమిన్‌పేట, రాజేంద్రనగర్, మర్పల్లి
టీఆర్‌ఎస్: దోమ, గండేడ్, బషీరాబాద్, తాండూరు, యాలాల, పరిగి, వికారాబాద్
 కాంగ్రెస్: శామీర్‌పేట, ధారూరు, బంట్వారం, శంకర్‌పల్లి, పెద్దేముల్, నవాబ్‌పేట, మహేశ్వరం
 బీజేపీ-టీడీపీ: హయత్‌నగర్, మేడ్చల్, కీసర, శంషాబాద్, కుత్బుల్లాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement