మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు.. | The selection procedure of Mandal Parishad captains | Sakshi
Sakshi News home page

మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు..

Published Thu, Jul 3 2014 1:00 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

The selection procedure of Mandal Parishad captains

మంచిర్యాల రూరల్ : ఈ నెల 4వ తేదీన మండల ప్రజా పరిషత్ సారథుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. విప్‌ను దిక్కరించే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎంపికైన ఎంపీటీసీలు చాలా మంది రిజర్వేషన్లు అనుకూలించి కొత్తగా ఎంపికైన వారే ఉండడంతో వారిలో పలు రకాల అనుమానాలను నివృత్తి చేసేందుకు విధి విధానాలు అందిస్తున్నాం.

 ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
 మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల రోజునే కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఒక్కో మండలానికి ఒక్కో కో-ఆప్షన్ సభ్యుడు ఉంటాడు. కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వారు మైనార్టీకి చెందిన వారై ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్టు, జొరాస్ట్రియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, మన రాష్ట్ర భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల భాషలు మాట్లాడే వయోజనులు కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. వీరు ఆయా మండలానికి చెందిన వారై ఉండాలి.

జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్ల ప్రచురణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం తక్షణ సమావేశం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పోటీలో ఉంటే, తెలుగు అక్షరమాల ప్రకారం జాబితాను సిద్ధం చేసి క్రమసంఖ్యలో నంబర్లను కేటాయించి, ఎన్నిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేందుకు ఎంపీటీసీలు చేతులెత్తి ఓటు వేస్తారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలకు విప్ నియమాలు వర్తించవు.

 కోరం ఉంటేనే అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక
 మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తక్షణ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఏర్పాటు చేస్తారు. ఎంపిక నిర్వహణకు అరగంటలోగా ఎంపీటీసీల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా మండలంలోని ఎంపీటీసీల్లో సగంగానీ, అంత కంటే ఎక్కువ మందిహాజరైతే కోరం ఉన్నట్లు, సగం కంటే తక్కువ మంది సమావేశానికి హాజరైతే కోరం లేనట్లు, ఇలా కోరం లేకున్నా, కోరం ఉండి ఎన్నిక జరగని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి మరుసటి రోజున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిదినమైనా, సెలవు రోజైన సమావేశం ఉం టుంది.

ఒకవేళ ఎన్నికకు కోరం లేక, ఇతరత్రా కారణాలతో మరోసారి ఎన్నిక జరగకపోతే, విషయాన్ని ఎన్నికల కమీషన్‌కు తదుపరి ఆదేశాల కోసం నివేదిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచించాలి. మరో సభ్యుడు సమర్ధించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాలి. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి ‘డ్రా’ పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు.

 విప్ ధిక్కరిస్తే అనర్హతే..
 మండల పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సూచించిన నిర్ణయాలకు కట్టుబడాలి. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా, ఆయా పార్టీలు వారి అభ్యర్థులపై కొరఢా ఝుళిపించే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేందుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి.

 స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని గానీ, పార్టీ ఇతర నాయకుడిని గానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం గంట ముందు ఎన్నికల అధికారికి అందించాలి.

అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకాలు చేయకపోతే విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్‌ను అందుకుని, ఎన్నిక సందర్భంగా దిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీ విప్ మూడు రోజుల్లోపు ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆయన సదరు సభ్యుడిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో, ఆ సభ్యుడు అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement