Co - option
-
జడ్పీఠమెక్కారు
మచిలీపట్నం : జిల్లా పరిషత్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ప్రశాంతంగా జరిగింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎంపిక కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గద్దె అనూరాధ, వైస్ చైర్‌పర్సన్‌గా శాయన పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను వేదికపై వారి స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీడీపీ జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు హాజరయ్యారు. పాలకవర్గ ఎన్నిక జరిగిందిలా... జిల్లా పరిషత్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యులుగా కంచికచర్ల మండలం పెండ్యాల నుంచి షేక్ అన్వర్, తిరువూరు నుంచి టి.పుష్పరాజ్ టీడీపీ తరఫున నామినేషన్లు అందజేశారు. అవి సక్రమంగానే ఉన్నట్లు ప్రకటించిన అధికారులు వారిద్దరూ కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు అక్షరమాల క్రమంలో 49 మంది జెడ్పీటీసీ సభ్యులతో, కో-ఆప్షన్ సభ్యులతోనూ కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. చైర్పర్సన్ ఎన్నిక జరిగిందిలా.. : మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను కలెక్టర్ నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు గద్దె అనూరాధ పేరును గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే, కైకలూరు జెడ్పీటీసీ సభ్యురాలు బి.విజయలక్ష్మి ప్రతిపాదించారు. అభ్యంతరాలేవీ లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యురాలు పి.విజయలక్ష్మి, కంచికచర్ల జెడ్పీటీసీ సభ్యుడు కేవీ సత్యనారాయణ ప్రతిపాదించగా, ఆమె కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అభినందనల వెల్లువ... జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గద్దె అనూరాధ, శాయన పుష్పావతిలను మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అభినందించారు. అభినందనలు తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్.స్వామిదాసు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్ధనరావు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, విజయవాడ మాజీ మేయర్ పి.అనూరాధ, జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, టీడీపీ జిల్లా పరిశీలకుడు బుచ్చయ్యచౌదరి, మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్ ఎం.బాబాప్రసాద్, మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి ఉన్నారు. -
స్థానిక సారథుల ఎన్నిక ఇలా..
‘విప్’ కీలకం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగి నందున, ఆయా పార్టీల గెలిచిన వారు, సారథుల ఎన్నికలో తమ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాల్ని ధిక్కరిస్తే.. వారిపై కొరడా ఝళిపించే అవకాశం ఉంటుంది. స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు ఈ నిబంధన వర్తించదు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మాలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని కానీ, పార్టీ ఇతర నాయకుడిని కానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర నాయకుడు, సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యు లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం ఒక గంట ముం దు, ఎన్నికల అధికారికి అందించాల్సి ఉం టుంది. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకం చేయకపోతే.. విప్ వర్తించదు. ఏ పార్టీ స భ్యుడైనా విప్‌ను అందుకుని, ఇతరులకు ఓ టు వేస్తే.. ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘన పై పార్టీ విప్ మూడు రోజు ల్లోపు ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీస్ జారీ చేస్తారు. విప్ ధిక్కరించడం వల్ల అర్హతను కోల్పోవచ్చు. ఎంపీలకు ఒకేచోట అవకాశం మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రకటనను మున్సిపల్ సభ్యులుగా ఎన్నికైన వారికి, ఆయా సంఘాల్లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకు, ఆప్షన్ ఇచ్చిన ఎంపీలకు అందజేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉన్న చోట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ పరిధిలో మున్సిపాలిటీలు ఒకటి కంటే అధికంగా ఉన్నప్పుడు ఏదో ఒక చోట మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. వారు ప్రత్యేక సమావేశానికి హాజరై అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే నాటికి, మున్సిపల్ పరిధిలో ఓటరు అయి ఉంటే.. వారూ ఓటు వేయవచ్చు. జిల్లా, మండల పరిషత్తు సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు(లోక్‌సభ, రాజ్యసభ) ఆహ్వానం ఉంది. కానీ వారికి ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. కో- ఆప్షన్ సభ్యుడి ఎన్నిక విధానం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు సారథుల ఎన్నిక తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులకు ఒక ఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్తుకు ఇద్దరిని ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన వయోజనులు నిర్దేశిత ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 10 గంటలకి నామినేషన్లు సమర్పించాలి. 10 నుంచి 12 గంటల వరకు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉపసంహరణ, ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే తెలుగు అక్షర క్రమంలో జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులలో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీలు కో-ఆప్షన్ సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఓటు వేసి ఎన్నుకుంటారు. ఇక్కడ సరి సమానంగా ఓట్లు వస్తే.. డ్రా పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదు. మున్సిపాలిటీలకు ముగ్గురు చొప్పు న సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు మైనార్టీ వర్గాల వారై ఉండాలి. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్వర్గాలో ఎవరైనా ఆ పురపాలక సంఘం పరిధిలో ఓటర్లుగా ఉన్న వారిని ఎన్నుకోవాలి. మరో సభ్యుడిగా రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి, వివిధ రంగాలపై అవగాహన కలిగిన వారిని ఎన్నుకోవాలి. -
మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు..
మంచిర్యాల రూరల్ : ఈ నెల 4వ తేదీన మండల ప్రజా పరిషత్ సారథుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. విప్‌ను దిక్కరించే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎంపికైన ఎంపీటీసీలు చాలా మంది రిజర్వేషన్లు అనుకూలించి కొత్తగా ఎంపికైన వారే ఉండడంతో వారిలో పలు రకాల అనుమానాలను నివృత్తి చేసేందుకు విధి విధానాలు అందిస్తున్నాం. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల రోజునే కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఒక్కో మండలానికి ఒక్కో కో-ఆప్షన్ సభ్యుడు ఉంటాడు. కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వారు మైనార్టీకి చెందిన వారై ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్టు, జొరాస్ట్రియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, మన రాష్ట్ర భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల భాషలు మాట్లాడే వయోజనులు కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. వీరు ఆయా మండలానికి చెందిన వారై ఉండాలి. జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్ల ప్రచురణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం తక్షణ సమావేశం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పోటీలో ఉంటే, తెలుగు అక్షరమాల ప్రకారం జాబితాను సిద్ధం చేసి క్రమసంఖ్యలో నంబర్లను కేటాయించి, ఎన్నిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేందుకు ఎంపీటీసీలు చేతులెత్తి ఓటు వేస్తారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలకు విప్ నియమాలు వర్తించవు. కోరం ఉంటేనే అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తక్షణ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఏర్పాటు చేస్తారు. ఎంపిక నిర్వహణకు అరగంటలోగా ఎంపీటీసీల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా మండలంలోని ఎంపీటీసీల్లో సగంగానీ, అంత కంటే ఎక్కువ మందిహాజరైతే కోరం ఉన్నట్లు, సగం కంటే తక్కువ మంది సమావేశానికి హాజరైతే కోరం లేనట్లు, ఇలా కోరం లేకున్నా, కోరం ఉండి ఎన్నిక జరగని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి మరుసటి రోజున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిదినమైనా, సెలవు రోజైన సమావేశం ఉం టుంది. ఒకవేళ ఎన్నికకు కోరం లేక, ఇతరత్రా కారణాలతో మరోసారి ఎన్నిక జరగకపోతే, విషయాన్ని ఎన్నికల కమీషన్‌కు తదుపరి ఆదేశాల కోసం నివేదిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచించాలి. మరో సభ్యుడు సమర్ధించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాలి. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి ‘డ్రా’ పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. విప్ ధిక్కరిస్తే అనర్హతే.. మండల పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సూచించిన నిర్ణయాలకు కట్టుబడాలి. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా, ఆయా పార్టీలు వారి అభ్యర్థులపై కొరఢా ఝుళిపించే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేందుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని గానీ, పార్టీ ఇతర నాయకుడిని గానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం గంట ముందు ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకాలు చేయకపోతే విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్‌ను అందుకుని, ఎన్నిక సందర్భంగా దిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీ విప్ మూడు రోజుల్లోపు ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆయన సదరు సభ్యుడిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో, ఆ సభ్యుడు అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. -
ఒక్కచాన్స్... ప్లీజ్
విజయనగరం ఫూల్‌బాగ్: పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఇదీ పట్టణంలోని అశోక్‌బంగ్లాలో ఒక తెలుగుతమ్ముడు జిల్లా నాయకునికి వేడుకోలు. సార్ ప దేళ్లపాటు పార్టీ కోసం ఎంతో పనిచేశాను. కో- ఆప్షన్ ఇప్పించండి’ ఇది మరో తెలుగు తమ్ముడి విజ్ఞాపన. మున్సిపాల్టీలో పాల కవర్గం ఇంకా కొలువు తీరలేదు. కానీ కో-ఆప్షన్ పదవుల కో సం తెలుగుతమ్ముళ్లు పైరవీలు సాగిస్తున్నారు. మూడు కో-ఆప్షన్ పదవులే విజయగనరం మున్సిపాల్టీలో మూడు కో-ఆప్ష న్ పదవులు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం ఒకటి మైనార్టీ వర్గానికి, మరొకటి మహిళలకు కేటాయించాల్సి ఉంది. మరొక పదవి మున్సిప ల్ చట్టాలపై అవగాహన ఉండి, చదువుకున్న వారికే లభిస్తుంది. మైనార్టీ వర్గాల నుంచి ఎస్‌కెఎం భాషాతోపాటు టీడీపీలోకి వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదితో పాటు పలువురు ముస్లిం నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకునిగా ఉన్న ఎస్కేఎం భాషా భార్య కౌన్సిలర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌కెఎం భాషాకు ఈసారి కో-ఆప్షన్ పదవి దక్కకపోవచ్చునని టీడీపీ వర్గాల అభిప్రాయం. మహిళా కోటా నుంచి టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు భార్య పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఐవీపీ రాజు పార్టీ పెద్దల వద్ద తన అభిప్రాయం వ్య క్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆమెకు కో- ఆప్షన్ పదవి కేటాయించడం లాంఛన ప్రాయమైనట్టు తెలుస్తోం ది. ఇక మూడో కో-ఆప్షన్ పదవి కోసం పోటీ భారీస్థాయిలో ఉంది. ఈ జాబితా చాంతాడంత ఉంది. టీడీపీ నాయకులు కేఏపీ ప్రసాద్‌రాజు కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు.అదేవిధంగా డాక్టర్ వీఎస్ ప్రసాద్, డాక్టర్ రామయ్య కూడా తమతమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి లేనట్లేనా? మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణకు దాదాపుగా ఖరారైపోయింది. ప్రసాదుల రామకృష్ణ యాదవసామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పా టు మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు యా దవ సామాజిక వర్గానికి చెందినవారు విజయం సాధించారు. దీంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈసారి కో-ఆప్షన్ పదవి ద క్కకపోవచ్చుననే వార్తలువినిపిస్తున్నాయి. యా దవ సామాజిక వర్గం నుంచి ఇప్పలి అప్పల కొండ, కిల్లాన మహేష్‌యాదవ్, కాగిత శ్రీనివాస్‌యాదవ్ బంటుపల్లి శ్రీనివాస్‌యాదవ్, గొల గాని రమేష్‌యాదవ్, గువ్వల తిరుపతిరావుయాదవ్, పూసర్ల రమణయాదవ్, నైదాన శ్రీని వాసరావుయాదవ్తో తదితరులుఆశిస్తున్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన మద్దాల ము త్యాలరావు, టీడీపీ నాయకుడు గొల్లకోటి గురునాథ్ కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పారిశ్రామిక చైర్మన్ ఆశలు వీటి అగ్రహారం ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవాడ చైర్మన్‌కు మున్సిపాల్టీలో కో-ఆప్షన్ పదవిని నామినేటెడ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నా యి. ఒక వేళ ఇదే జరిగితే మున్సిపాల్టీలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య మూడు నుంచి నా లుగుకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పారి శ్రామికవాడ చైర్మన్ మచ్చి రామలింగస్వామి కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు. ఈయ న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారైన ప్రసాదుల రామకృష్ణకు బంధువు. అందువల్ల తనకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అశోక్ రాకతోనే లెక్కతేలేది.. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ నెల 13వ తేదీన జిల్లాకు రానున్నట్టు తెలుస్తోంది. ఆయన వస్తే ఎవరెవరికి పదవులు వస్తాయనేది తేలు తుంది. తమ వద్దకు వచ్చిన ఆశావహులకు అశోక్ వస్తేగాని ఏమీ చెప్పలేమని టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ద్వారపురెడ్డి, జగదీష్, ఐవీపీ రాజు, ప్రసాదుల రామకృష్ణ చెప్తున్నట్టు సమాచారం.