జడ్‌పీఠమెక్కారు
మచిలీపట్నం : జిల్లా పరిషత్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ప్రశాంతంగా జరిగింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎంపిక కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గద్దె అనూరాధ, వైస్ చైర్‌పర్సన్‌గా శాయన పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను వేదికపై వారి స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీడీపీ జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు హాజరయ్యారు.
పాలకవర్గ ఎన్నిక జరిగిందిలా...
జిల్లా పరిషత్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యులుగా కంచికచర్ల మండలం పెండ్యాల నుంచి షేక్ అన్వర్, తిరువూరు నుంచి టి.పుష్పరాజ్ టీడీపీ తరఫున నామినేషన్లు అందజేశారు. అవి సక్రమంగానే ఉన్నట్లు ప్రకటించిన అధికారులు వారిద్దరూ కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు అక్షరమాల క్రమంలో 49 మంది జెడ్పీటీసీ సభ్యులతో, కో-ఆప్షన్ సభ్యులతోనూ కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు.
చైర్‌పర్సన్ ఎన్నిక జరిగిందిలా.. : మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను కలెక్టర్ నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు గద్దె అనూరాధ పేరును గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే, కైకలూరు జెడ్పీటీసీ సభ్యురాలు బి.విజయలక్ష్మి ప్రతిపాదించారు. అభ్యంతరాలేవీ లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యురాలు పి.విజయలక్ష్మి, కంచికచర్ల జెడ్పీటీసీ సభ్యుడు కేవీ సత్యనారాయణ ప్రతిపాదించగా, ఆమె కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.
అభినందనల వెల్లువ...
జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గద్దె అనూరాధ, శాయన పుష్పావతిలను మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అభినందించారు. అభినందనలు తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్.స్వామిదాసు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్ధనరావు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, విజయవాడ మాజీ మేయర్ పి.అనూరాధ, జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, టీడీపీ జిల్లా పరిశీలకుడు బుచ్చయ్యచౌదరి, మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్ ఎం.బాబాప్రసాద్, మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి ఉన్నారు.