పేదల ఇలాకా... ‘తమ్ముడి’ తడాఖా | The jurisdiction in which the poor ... 'brother' winning streak | Sakshi
Sakshi News home page

పేదల ఇలాకా... ‘తమ్ముడి’ తడాఖా

Published Wed, Jul 30 2014 1:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

పేదల ఇలాకా... ‘తమ్ముడి’ తడాఖా - Sakshi

పేదల ఇలాకా... ‘తమ్ముడి’ తడాఖా

  •  సీలింగ్ భూమిపై టీడీపీ నేత కన్ను
  •   నకిలీ పత్రాల సృష్టించి పేదల గుడిసెలు కూల్చేందుకు కుట్ర
  •   వంతపాడుతున్న పోలీసులు
  •   నేడు ఇళ్లు కూల్చివేస్తామని హెచ్చరిక
  •   వైఎస్సార్ సీపీకి ఓటేశామనేకక్ష కట్టారని బాధితుల గగ్గోలు
  • అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డదారుల్లో సంపాదనకు తెరలేపాడు ఓ తెలుగు తమ్ముడు. నకిలీ పత్రాలను సృష్టించి బందరులో  విలువైన భూములను సొంతం చేసుకునేందుకు పథకం రచించాడు. పేదలకు అండగా నిలవాల్సిన పోలీసులు కూడా అతను చెప్పినట్టే నడుచుకుంటున్నారు. పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందువల్లే కక్ష సాధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
     
    మచిలీపట్నం : ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న చందంగా ఓ తెలుగు తమ్ముడు కుట్రకు తెరలేపాడు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో పేదలు నివసిస్తున్న గుడిసెలను కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చక్రం తిప్పుడుతున్నాడు. ఆ భూమి తనదంటూ నకిలీ కాగితాలు సృష్టించినట్లు సమాచారం. పోలీసులను రంగంలోకి దించాడు. దీంతో పదిహేను రోజులుగా పోలీసులు పేదల వద్దకు వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని, లేకపోతే మీపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరిస్తున్నారు. మరో 24 గంటల్లో గుడిసెలు ఖాళీ చేయకపోతే పొక్లెయిన్లు తీసుకువచ్చి తామే కూల్చేస్తామంటూ ఇనగుదురు ఎస్‌ఐ మంగళవారం పేదలను బెదిరించడం చర్చనీయాంశమైంది.
     
    పదేళ్లుగా నివసిస్తున్నారు

    పట్టణంలోని 27వ వార్డులో శివగంగ గుడి వెనుక చల్లపల్లి రాజాకు చెందిన భూమి ఉంది. దానిని అప్పట్లోనే సీలింగ్ భూమిగా గుర్తించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ సీలింగ్ భూమిగానే ఉంది. పదేళ్ల క్రితం ఇళ్లస్థలాలు లేకపోవటంతో ఈ భూమిలో బండారు నాంచారయ్య, బొమ్మసాని బాలఏసు, విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు, డొక్కు శివరాజు, కటకం నాగరాజు, బండారు కనకయ్య, మారెళ్ల నాగేశ్వరరావు, బడే భవన్నారాయణ కుటుంబాలు గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నాయి. వీరు గుడిసెలు వేసుకునే సమయంలో 27వ వార్డు ప్రస్తుత కౌన్సిలర్ బంధువులు వీరికి సహాయ సహకారాలు అందించారు.

    పదేళ్లుగా ఈ కుటుంబాల వారు అక్కడే నివసిస్తుండటంతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లను రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది. ఈ భూమిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పావులు కదపటం ప్రారంభించాడు. ఈ మేరకు పదిహేను రోజుల క్రితం మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రికి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడ్ని సంప్రదించాడు. ఈ నాయకుడితో డీఎస్పీకి సిఫార్సు చేయించుకుని పేదలపైకి పోలీసులను ఉసిగొల్పాడు. ఏమీ ఆలోచించని పోలీసులు ఈ గుడిసెలు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ వస్తున్నారు.
     
    తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు
     
    ఇనగుదురుపేట ఎస్‌ఐ మా కుటుంబాల వారిని వారం రోజుల క్రితం స్టేషన్‌కు పిలిపించారు. ఎంతకాలం నుంచి అక్కడ నివసిస్తున్నారు.. అంటూ అన్ని వివరాలు తీసుకున్నారు. తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు ఈ విషయాన్ని డీఎస్పీకి వివరించేందుకు వెళితే స్వచ్ఛందంగా మీరే గుడిసెలు ఖాళీ చేస్తామని రాసి ఇచ్చారు కదా.. అని ఆయన ప్రశ్నిస్తే గానీ మాకు అసలు విషయం అర్థం కాలేదు. మంగళవారం మా వద్దకు వచ్చిన ఎస్‌ఐ బుధవారం గుడిసెలు కూల్చివేస్తానంటూ హెచ్చరించి వెళ్లారు.
     - బడే ఉమామహేశ్వరమ్మ
     
    పోలీసులు పట్టించుకోవడం లేదు

    పది సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. మంగళవారం మా ఇళ్ల వద్దకు వచ్చిన ఎస్‌ఐ బుధవారం ఉదయం పది గంటలలోపు ఖాళీ చేసేందుకు సమయం ఇస్తున్నానని చెప్పి వెళ్లారు. అప్పటికీ ఖాళీ చేయకపోతే పొక్లెయిన్ తీసుకువచ్చి తామే గుడిసెలు కూల్చివేయిస్తామని హెచ్చరించి వెళ్లారు. మాకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు ఇక్కడి చిరునామాతోనే ఉన్నాయి. ఇక్కడే నివసిస్తున్నట్లు తహశీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
     - బండారు ధనలక్ష్మి
     
    పేదలతో తెల్లకాగితాలపై సంతకాలు..

    వారం రోజుల క్రితం ఈ ఎనిమిది కుటుంబాల వారిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ గుడిసెలు ఖాళీ చేయకకపోతే ఇక్కట్ల పాలవుతారని హెచ్చరించారు. తనదైన శైలిలో వ్యవహారం నడిపి వీరితో తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా మంగళవారం మళ్లీ తన సిబ్బందితో కలిసి వెళ్లి గుడిసెలు ఖాళీ చేయకుంటే బుధవారం ఉదయం 10 గంటలకు పొక్లెయిన్ వస్తుందని, గుడిసెలు కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ భూమి మీదేనంటూ ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపండి..’ అంటూ ఎస్‌ఐ నానా హడావుడి చేయటంతో పేదలు కంగుతిన్నారు.

    ఎంతోకాలంగా ఇక్కడ నివసిస్తున్నామని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే కష్టమని పేదలు చెప్పినా సదరు ఎస్‌ఐ వినిపించుకోలేదని బాధితులు వాపోతున్నారు. గత ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామనే కారణంతోనే పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తమను ఖాళీ చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
     
    పోలీసులను ఉసిగొల్పుతున్నారు
     
    రెవెన్యూ అధికారులకు లేఖ రాసి ఆ భూమి ఏ స్థితిలో ఉందో తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పినా టీడీపీ నాయకులు ఇనగుదురు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకుల హడావుడితో బెదిరిపోయిన పేదలు పది రోజుల క్రితం వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)ను ఆశ్రయించారు. పేర్ని నాని ఈ పేదలను డీఎస్పీ వద్దకు తీసుకువెళ్లి  వాస్తవ పరిస్థితులను వివరించారు.

    పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే వారు తలదాచుకునేందుకు అవకాశం ఉండదని చెప్పారు. దీంతో ఈ గుడిసెలను ఖాళీ చేయించే విషయం కొన్ని రోజుల పాటు సద్దుమణిగింది. తాజాగా మంగళవారం మళ్లీ గుడిసెల వద్దకు తన పరివారంతో వెళ్లిన ఇనగుదురుపేట ఎస్‌ఐ బుధవారమే గుడిసెలు కూల్చివేస్తున్నామంటూ హెచ్చరికలు జారీ చేయటంతో పేదలు వణికిపోతున్నారు. పేదలు పదేళ్లుగా నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయించాలంటే రెవెన్యూ అధికారులు ఆ భూమి ఎవరిదో గుర్తించాలి. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలి. కొంత సమయం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలి.
     
    ఎలా కూల్చివేస్తారో చూస్తా : పేర్ని నాని
     
    భూమికి సంబంధించిన విషయంలో రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోతుండగా ఇనగుదురుపేట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఇనగుదురుపేట ఎస్‌ఐ బుధవారం పేదలు నివసిస్తున్న గుడిసెలను కూల్చివేస్తానని హెచ్చరించి వచ్చారని, అక్కడకు తానూ వెళతానని, పేదల గుడిసెలు ఎలా కూలుస్తారని ఆయన ప్రశిస్తున్నారు. ఈ విషయంపై ఇనగుదురు ఎస్‌ఐ అశోక్‌ను  ‘సాక్షి’ వివరణ కోరగా శివగంగ ప్రాంతంలో గుడిసెలకు సంబంధించిన అన్ని విషయాలను డీఎస్పీకి వివరించానని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement