పండుటాకుల పడిగాపులు | Ongoing pension Survey | Sakshi
Sakshi News home page

పండుటాకుల పడిగాపులు

Published Mon, Sep 22 2014 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

పండుటాకుల పడిగాపులు - Sakshi

పండుటాకుల పడిగాపులు

  • కొనసాగుతున్న పింఛన్ల సర్వే
  •  మచిలీపట్నంలో పలు వార్డుల్లో గందరగోళం
  •  గిలకలదిండిలో నిలిచిన సర్వే
  •  స్పృహ కోల్పోయిన వృద్ధుడు
  •  మిగిలిన నియోజకవర్గాల్లో ప్రశాంతం
  •  తనిఖీ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హవా
  • మచిలీపట్నం : సామాజిక పింఛన్లు పొందుతున్న వారి వివరాలు సేకరించేందుకు చేపట్టిన సర్వే ఆదివారం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కేంద్రాల వద్ద ఎదురు చూసిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వృద్ధుడు అస్వస్తతకు గురయ్యారు. ఇప్పటి వరకు పలు మండలాల్లో 90 శాతానికిపైగా సర్వే పూర్తయింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తాము చెప్పినవారికే భవిష్యత్తులో పింఛన్లు వస్తాయని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుండటం ఆందోళనకు గురవుతున్నారు. సర్వే ప్రక్రియ దాదాపు ఓ కొలిక్కి వచ్చినా ఈ నెల 25వ తేదీలోపు లబ్ధిదారుల పేరున ఉన్న భూముల వివరాలను కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సమర్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
     
    మచిలీపట్నంలోని 18వ వార్డులో కౌన్సిలర్ భర్తతోపాటు మరికొందరు సర్వే కమిటీ సభ్యులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. సర్వే ప్రక్రియను నిలిపివేశారు. గిలకలదిండిలో సోమవారం సర్వే చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మచిలీపట్నం 12వ వార్డులో కమిటీ సభ్యులతో సంబంధం లేకుండా కౌన్సిలర్ ఒక్కరే సర్వే చేయడం వివాదాస్పదమైంది. 42వ వార్డులో ఆదివారం ఆలస్యంగా సర్వే ప్రక్రియను నిర్వహించారు. ఉదయం నుంచి వేచి ఉన్న కరేటి వెంకటేశ్వరరావు అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన్ను అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 29వ వార్డులో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
     
    అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో ఆదివారం రాత్రి వరకు సర్వే నిర్వహించారు. సర్వే కేంద్రానికి రాలేని వారు ఉంటే సోమవారం వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
     
    పామర్రు నియోజకవర్గంలో సర్వే ప్రక్రియ 90శాతం పూర్తయింది. ఆదివారం నూతనంగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి అర్జీలు స్వీకరించారు.  
     
    గన్నవరం నియోజకవర్గంలో సర్వే ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. సోమవారం కూడా సర్వే కొనసాగుతుంది. లబ్ధిదారుల వద్ద ఆధారాలు సేకరించడంతోపాటు నూతన పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
     
    నందిగామ, నూజివీడు నియోజకవర్గాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.  
     
    జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో సర్వే ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, జగ్గయ్యపేట పురపాలక సంఘం, మండలంలో ఆదివారం ప్రారంభించారు.
     
    పెనమలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉండటంతో తాము చెబితేనే పింఛన్లు వస్తాయని హడావుడి చేస్తున్నారు.
     
    కైకలూరు నియోజకవర్గంలో ఆదివారం సర్వే ప్రక్రియ మందకొడిగా సాగింది. కమిటీ సభ్యులు హాజరుకాకపోవటంతో కొన్ని చోట్ల అంతంతమాత్రంగానే సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే దాదాపు పూర్తి కాగా, కైకలూరు పట్టణంతో పాటు కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండల కేంద్రాల్లో ఇంకా పూర్తి కాలేదు.
     
    గుడివాడ నియోజకవర్గంలో ఆదివారం సర్వే ప్రక్రియను నిర్వహించారు. సర్వే కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హడావుడి కనిపించింది.
     
    పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో దాదాపు సర్వే పూర్తయింది. పెడన మున్సిపాలిటీలోనూ ముగింపు దశకు చేరింది. సోమవారం కూడా సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, నూతన పింఛన్ల కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement