సాక్షి, విశాఖ: పార్టీ తీరుపై మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నాలుగైదు రోజులుగా అలకపాన్పుపై ఉన్న గంటాతో గురువారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాయబారం నడిపారు. దీంతో గంటా కాస్త మెత్తబడినట్టు కనిపించారు. ఈ క్రమంలోనే నేడు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు నేతలతో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడినట్లేనని టీడీపీ వర్గాలనుకున్నాయి. కానీ మధ్యాహ్నానికి విశాఖలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గంటా నియోజకవర్గం భీమిలి పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు లంచ్ కోసం గంటాకు కబురు పెట్టారు. అయితే సీఎం పిలిచినా పట్టించుకోని గంటా తన అనుచరులతో మరో హోటల్‌కు వెళ్లిపోయారు. తాజా పరిణామాలతో గంటా ఇంకా అలకపాన్పు దిగలేదని తెలుస్తోంది.
స్పందించిన గంటా
అయితే గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై గంటా మొదటిసారి స్పందించారు. ఆయన ఈరోజు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘ఇటీవల కొన్ని అంశాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. అదే ముఖ్యమంత్రితో చర్చించాను. కార్యక్రమాల్లో పాల్గొనమన్నారు. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాల’ని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment